Site icon HashtagU Telugu

Godavari Water: ఏపీకి కేంద్రం మరో అన్యాయం! గోదావరి జలాలు ఇతర రాష్ట్రాలకు..!

Center Is Another Injustice To Ap! Godavari Waters To Other States..!

Center Is Another Injustice To Ap! Godavari Waters To Other States..!

ఇచ్చంపల్లి నుండి గోదావరి (Godavari) – కావేరి (Kaveri) అనుసంధానమా!

ఏపీ రాష్ట్రానికి కేంద్రం మరో అన్యాయం చేయడానికి సిద్ధమైంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ గోదావరి (Godavari) జలాలను కావేరి కి తరలించడానికి సాహసం చేస్తుంది. ఇచ్ఛం పల్లి నుంచి నీళ్లు తరలిస్తే అన్యాయం జరిగినట్టే. దీనిపై ప్రభుత్వం ఫైట్ చేయకపోతే ఏపీకి తీరని నష్టం జరుగుతుందని నీటి రంగ నిపుణులు అలెర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధాన పథకంలో భాగంగా గోదావరి – కావేరి అనుసంధానానికి స్థూలంగా రాష్ట్రాలు అంగీకరించాయని, ఇచ్చంపల్లి సమీపంలో ఆనకట్ట నిర్మించి ఛత్తీస్గఢ్ వినియోగించుకోని 141 టి.యం.సి.లను తరలిస్తామని, మిగులు జలాలను తరలిస్తే తమకు అభ్యంతరంలేదని తెలంగాణ తెలియజేసిందని, నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్ వెల్లడించడాన్ని బట్టి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర గర్హనీయం, ఆందోళన కలిగించే అంశం.

గోదావరి (Godavari) నదీ జలాలపై 1980లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాలు 75% నీటి లభ్యత ప్రామాణికంగా నికర జలాలను వినియోగించుకున్న మీదట చివరి జలాశయం లేదా ఆనకట్ట నుండి నీరు క్రిందికి ప్రవహించి, సముద్రంలో కలిసే నీటిని మాత్రమే మిగులు జలాలగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే, ధవళేశ్వరం ఆనకట్ట తర్వాత సముద్రంలోకి ప్రవహిస్తున్న నీటిని మాత్రమే మిగులు జలాలు పరిగణించాలి. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో పైభాగంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఇచ్చంపల్లి సమీపం నుండి నదుల అనుసంధాన పథకం ద్వారా మిగులు జలాల పేరుతో నీటిని తరలించడం అసంబద్ధం, అత్యంత ప్రమాదకరం, ఆమోదయోగ్యం కాదు.

పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పైభాగం నుండి మిగులు జలాల పేరుతో గోదావరి – కావేరి అనుసంధాన పథకాన్ని నిర్మిస్తే దిగువనున్న ఆంధ్రప్రదేశ్ కు శాశ్వతంగా నష్టం జరుగుతుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించాలి. జాతీయ స్థాయిలో తలపెట్టిన నదుల అనుసంధాన పథకంలో భాగంగా మొదట మహానది – గోదావరి, అటుపై పోలవరం నుండి గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి నదుల అనుసంధాన పథకాన్ని నిర్మించాలి. పోలవరం నుండి కాకుండా ఇచ్చంపల్లి సమీపం నుండి పథకాన్ని నిర్మించి, గోదావరి జలాలను తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించకూడదు.

Also Read:  Holi: హోలీ పూర్ణిమలోని అధ్యాత్మక మన్మథ రహస్యం