Site icon HashtagU Telugu

Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం మరో గుడ్‌న్యూస్‌.. లోకేష్‌కి ఉక్కుమంత్రి కితాబు!

Visakha Steel Plant

Visakha Steel Plant

Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ అనుమానాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్‌ పునర్‌నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో స్టీల్‌ ప్లాంట్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. ఐతే కూటమి సర్కార్ ఒత్తిడితో ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకుంది. ఇక విశాఖ స్టీల్‌ ప్లాంట్ పునర్నిర్మాణంపై స్పెషల్‌ ఫోకస్ పెట్టింది.

తాజాగా విశాఖ ఉక్కు పరిశ్రమకు ఐరన్‌ఓర్‌కు సంబంధించి మరో గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పూర్తిస్థాయిలో ఐరన్‌ఓర్ సరఫరా చేసేందుకు నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి మూడో బ్లాస్ట్‌ ఫర్నేసను ఆపరేషన్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమకు దాదాపు నెలకు 6 లక్షల టన్నుల ఐరన్‌ఓర్‌ అవసరమవుతుంది. ప్రతిరోజూ 8 ర్యాక్‌ల గూడ్స్‌ రైళ్లు సరఫరా చేయాలనే ఒప్పందం ఉండగా..ఆరుకు మించి ర్యాక్‌లు రావడం లేదు. ఇకపై పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో NMDC,RINL మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం 2027 మార్చి వరకు అమలులో ఉండనుంది.

Also Read: Jagan In Illusions: భ్రమల్లో జగన్‌.. ఎవరయినా చెప్పండయ్యా!

కేంద్ర ప్రభుత్వం 2021లో విశాఖ ఉక్కుల పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటివరకూ లాభాలు సాధిస్తూ వచ్చిన కర్మాగారం సొంత గనుల్లేకుండా విస్తరణకు వెళ్లడం నష్టాలకు దారి తీసింది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.38 వేల 965 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది. విశాఖ ఉక్కును ఆదుకోవాలంటూ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, లోకేష్‌, కూటమి ఎంపీలు..ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. దీంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన ప్రధానిని ఒప్పించే ప్రయత్నం చేశారు.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌లో భాగంగా ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉన్న భారతదేశం 2030 నాటికి 30కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రెండు విడతల్లో రూ.1,640 కోట్లను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అత్యవసర నిధులుగా అందించింది. వీటితో పూర్తిస్థాయి ఉత్పత్తిని తీసుకొచ్చారు. ఈ నమ్మకంతో తాజాగా రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీని సైతం కేంద్రం ప్రకటించింది. ఇందులో రూ.10,300 కోట్లను మూలధన వాటా కింద సమకూరుస్తోంది. ఈ నిధులను ప్రాధాన్యతల వారీగా సర్దుబాటు చేసేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా విద్యుత్, నీరు తదితర అవసరాలకయ్యే ఖర్చులను రూ.2వేల కోట్ల వరకు ఈక్విటీ రూపంలో భరించేందుకు నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం చొరవతో విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్‌వైభవానికి ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి.

ఇటు, యువమంత్రి లోకేష్‌.. ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో మంత్రి కుమారస్వామితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ఈ ఇద్దరి సమావేశంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై చర్చ సాగినట్లు సమాచారం.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి పాజిటివ్‌ న్యూస్‌ వినిపించడం చర్చనీయాంశంగా మారింది.. అంతేకాదు, కేంద్ర మంత్రి కుమారస్వామి ఇటీవల…. విశాఖ ఉక్కుపై మంత్రి లోకేష్‌ చాలా చొరవ తీసుకున్నారని, ప్లాంట్‌ పరిరక్షణకు రాష్ట్ర సర్కార్‌ అందించనున్న తోడ్పాటును సైతం వివరించారని, ఆయన సంకల్పం చూసి తాను చలించానన్నారు.. నిన్న రైల్వే జోన్‌కి సంబంధించి స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌ వినిపించింది.. తాజాగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై మరో వార్త వెలుగులోకి వచ్చింది.. మొత్తమ్మీద, రాష్ట్ర ప్రయోజనాలపై కూటమి సర్కార్‌ నిబద్ధత, పనితీరుకు ఇది నిదర్శనం..