Kapu Reservations: కాపు రిజర్వేషన్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. ఏపీ సర్కార్‌కు తీపి కబురు!

ఆంధ్రప్రదేశ్‌లోని కాపులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కాపు రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన వెలువరించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌కు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం 2019లో ఓ చట్టం తెచ్చింది.

  • Written By:
  • Publish Date - December 21, 2022 / 08:29 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని కాపులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కాపు రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన వెలువరించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌కు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం 2019లో ఓ చట్టం తెచ్చింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కాపుల రిజర్వేషన్‌ అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఓ ప్రశ్న అడిగారు.

దీనిపై స్పందించిన కేంద్ర సామాజిక, న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో కీలక విషయాలు వెల్లడించారు. కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్‌ చెల్లుబాటు అవుతుందని కేంద్రం తెలిపింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. 2019లో ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి చట్టబద్ధత ఉందని కేంద్రం తెలిపింది.

ఆ బిల్లు చెల్లుబాటు అవుతుంది..
రాష్ట్ర జాబితాలోకి వచ్చే కాపులకు రిజర్వేషన్ల కల్పనలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంతమాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపులకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ బిల్లు బేషుగ్గా చెల్లుతుందని కేంద్రం చెప్పింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చని సూచించింది. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.