Greenfield Highway : కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం తెలిపింది. డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరికొన్ని సమస్యల పరిష్కారాలకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ రోడ్డుకు ఉత్తరభాగం నుంచి హైవే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళకులు రూపొందిస్తోంది.
Read Also: RBI : మరోసారి వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ..ఈసారి ఎంతంటే !
ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ నుండి అమరావతి వరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కు సంబంధించి ప్రణాళికలు నేషనల్ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలని ఆదేశించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, వైజాగ్ నుండి మూలాపేట, విజయవాడ తూర్పు బై పాస్, విజయవాడ -హైదరాబాద్, హైదరాబాద్ -బెంగుళూరు హైవేల విస్తరణకు కేంద్రం తాజా నిర్ణయంతో అడుగులు పడుతున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో అమరావతి రింగ్ రోడ్డు, హైదరాబాద్ రీజినల్ రింగ్ ఉత్తర భాగం అనుమతులు రానున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు కసరత్తు మొదలుపెట్టనున్నారు. కేంద్ర హోం శాఖ ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. విభజన చట్టంలోని లేని అంశాలలో సైతం పురోగతి లభించింది.
కాగా, ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులు, ఇతర పరిష్కారం కాని సమస్యలపై రెండు నెలలకోసారి సమావేశమై చర్చించాలని కేంద్రం ఇటీవల సూచించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఫిబ్రవరి 3న జరిగిన సమావేశానికి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆ సందర్భంగా చర్చించిన అంశాలలో తాజాగా పురోగతి లభించింది. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజనపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.