Site icon HashtagU Telugu

CBN Plan 45 : భ‌విష్య‌త్ కు 45 రోజుల ప్రణాళిక‌, చంద్ర‌బాబు దూకుడు

CBN Plan 45

Chandrababu Mahanadu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు (CBN Plan 45) ఏది చేసినా ఒక ప్ర‌ణాళిక ఉంటుంది. దానికి వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాలు, ల‌క్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు 45 రోజుల ప్ర‌ణాళిక కూడా చంద్ర‌బాబు ల‌క్ష్యాన్ని ముద్దాడే దిశ‌గా రచించిన‌దే. దానిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల‌ను చుట్టేయ‌బోతున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని గ్రూపు విభేదాల‌ను ఈ 45 రోజుల టూర్లో స‌రిచేయ‌బోతున్నారు. రాబోవు ఎన్నిక‌ల నాటికి ఐక్యంగా ప‌నిచేసే సంస్కృతిని తీసుకురావాల‌ని భావిస్తున్నారు. `బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్ కు గ్యారంటీ` అనే కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ప్రారంభించారు.

బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్ కు గ్యారంటీ (CBN Plan 45)

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ జోన్ 2 స‌మావేశాన్ని చంద్ర‌బాబు  (CBN Plan 45) శనివారం నిర్వ‌హించారు. స్థానిక లీడ‌ర్లు, క్యాడ‌ర్ తో మ‌మేకం అయ్యారు. రాబోవు 45 రోజుల పాటు ప్ర‌తి ఇంటికి వెళ్లాల‌ని దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తే రాష్ట్రం ఎలా ఉంటుంది? అనే విష‌యాన్ని ప్ర‌జ‌ల ముందు ఆవిష్క‌రించాల‌ని సూచించారు. మినీ మేనిఫెస్టోలోని అంశాల‌ను ప్ర‌జ‌లు తెలియ‌చేయాల‌ని ఆదేశించారు. ఆ మేనిఫెస్టోలో మ‌హాశ‌క్తి పేరిట మ‌హిళ‌ల‌కు ప‌లు ఉచిత స్కీమ్ ల‌ను ప్ర‌క‌టించారు. అలాగే, బీసీల‌కు ప్ర‌త్యేక చ‌ట్టం తీసుకొస్తామ‌ని హామీ ఇచ్చారు. రైతుల‌కు ఏడాదికి రూ. 20వేల స‌హాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఉచిత బ‌స్సు సౌక‌ర్యాన్ని కల్పిస్తూ మ‌హిళ‌ల‌కు సౌక‌ర్యం క‌ల్పించారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు.

మినీ మ‌హానాడు అంశాల‌ను 45 రోజుల పాటు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌

మినీ మ‌హానాడులోని అంశాల‌ను ఈనెల 45 రోజుల పాటు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు పెట్టాల‌ని రోడ్ మ్యాప్ ను ఇచ్చారు. అలాగే, 2019 నుంచి సాగిన పాల‌న కార‌ణంగా 20ఏళ్లు రాష్ట్రం వెనుక‌బ‌డిన విష‌యాన్ని ప్ర‌స్తావించాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో బ‌ట‌న్ నొక్కే ప్ర‌భుత్వం మాత్ర‌మే ఉంద‌ని తెలియ‌చేయాల‌ని (CBN Plan 45) దిశానిర్దేశం చేశారు. వాస్త‌వంగా పారిశ్రామీక‌ర‌ణ‌, ఉద్యోగ‌, ఉపాథి అవ‌కాశాలు లేవ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద వ్య‌తిరేక‌త ఉంది. మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంలోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెనుక‌బ‌డ్డార‌ని మోజార్టీ ప్ర‌జ‌ల్లోని భావ‌న‌గా ఉంద‌ని స‌ర్వేల సారాంశం. ఆ అంశాల‌ను తెలియ‌చేస్తూ రాబోవు రోజుల్లో భ‌విష్య‌త్ కు బాబు ష్యూరిటీ ఇస్తున్నార‌ని ప్ర‌జ‌లకు తెలియ‌చేయాల‌ని చంద్ర‌బాబు ప్రోగ్రామ్ లోని ప్ర‌ధాన ఉద్దేశం.

Also Read : TDP Manifesto: చంద్రబాబు దూకుడు.. దసరాకు టీడీపీ మేనిఫెస్టో!

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టికే 120 స్థానాల మీద క్లారిటీగా ఉన్న టీడీపీ మిగిలిన స్థానాల్లోనూ అభ్యర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. సుమారు 50 నుంచి 60 స్థానాల వ‌ర‌కు గ్రూపు విభేదాలు ఉన్నాయ‌ని గుర్తించింది. వాటిని స‌రిచేసే బాధ్య‌త‌ను చంద్ర‌బాబు తీసుకున్నారు. మునుప‌టి మాదిరిగా కాకుండా ఖ‌రాకండిగా అభ్య‌ర్థుల‌ను తేల్చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇప్ప‌టికే వైసీపీ నుంచి వ‌చ్చే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నార‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. తాము గేట్లు ఎత్తితే, వైసీపీ ఖాళీ అవుతుంద‌ని గ‌త వారం ఆయ‌న హెచ్చ‌రించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పార్టీలో ఉన్న వాళ్ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వైసీపీ నుంచి వ‌చ్చే వాళ్ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాంటి ప‌రిణామం గన్న‌వ‌రంలో జ‌రిగింది. అక్క‌డి వైసీపీ నేత యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు టీడీపీలోకి వ‌చ్చారు. వెంట‌నే ఆయ‌న‌కు అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఆయ‌న ఇప్ప‌టి నుంచి ప‌నిచేయ‌డం ప్రారంభించారు. ఇదే త‌ర‌హాలో రాష్ట్ర వ్యాప్తంగా క్లారిటీ ఇవ్వాల‌ని (CBN Plan 45)చంద్ర‌బాబు భావిస్తున్నారు.

Also Read : CBN Social Media : పొత్తు కోసం చంద్ర‌బాబుపై ఐటీ ప్ర‌యోగం?

ప్ర‌స్తుతం చేస్తోన్న 45 రోజుల `బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్ కు గ్యారంటీ` ప్రోగ్రామ్ ఒక వైపు సంస్థాగ‌త పార్టీని బ‌లోపేతం చేయ‌డం మ‌రో వైపు ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చేలా ద్విముఖ వ్యూహాన్ని చంద్ర‌బాబు ర‌చించారు. వై నాట్ పులివెందుల దిశ‌గా అడుగులు వేస్తోన్న ఆయ‌న టార్గెట్ 160 పెట్టుకున్నారు. ఆ దిశ‌గా కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం 45 రోజుల ప్రోగ్రామ్ విజ‌య‌వంతమైతే టార్గెట్ 160 ని చేరుకున్న‌ట్టే ఆయ‌న భావిస్తున్నారు. అందుకే, జిల్లా,మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ‌, గ్రామ స్థాయి లీడ‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. బూతు స్థాయి లీడ‌ర్ల వ‌ర‌కు ఈ ప్రోగ్రామ్ చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. కుటుంబ సార‌థుల ఎంపిక పూర్తి చేసి, ఈ కార్య‌క్ర‌మంలో వాళ్ల‌ను కీల‌క భాగ‌స్వాముల‌ను చేయాల‌ని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. దీంతో ఉత్సాహంగా టీడీపీ సైన్యం ముందుకు క‌దులుతోంది.