Site icon HashtagU Telugu

Chandrababu Naidu:`షో` బిజినెస్ చెల్ల‌దు.!

CBN Target

naidu TDP

“ఓట్లు వేయించ‌లేని వాళ్లు పార్టీకి అవ‌సరంలేదు. ప‌నిచేయ‌కుండా సీనియర్ల‌మంటే టిక్కెట్ ఇవ్వ‌ను. 40శాతం యూత్ కోటాలో వార‌సులకు ఇవ్వ‌మంటే కుద‌ర‌దు. క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక‌పోతే మ‌ళ్లీ ప్ర‌తిప‌క్షంలో కూర్చోవాలి..“ అంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు తెలుగుదేశం పార్టీలో `షో` చేసే లీడ‌ర్ల‌కు వ‌ణుకుపుట్టిస్తోంది. అస‌లు విష‌యం చంద్ర‌బాబుకు తెలిసి పోయింద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ప్ర‌కారం ప‌నిచేసే వాళ్ల‌కే ఈసారి అభ్య‌ర్థిత్వాల‌ని స్ప‌ష్టమ‌వుతోంది.

మూడు ర‌కాల లీడ‌ర్లు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో త‌ర‌చూ తార‌స‌ప‌డ‌తారు. అలాంటి వాళ్లే జిల్లా టీడీపీ ఆఫీస్ ల్లోనూ క‌నిపిస్తుంటారు. లైబ్ర‌రీ నుంచి ఇచ్చే ఇన్ పుట్స్ తీసుకుని ప్రెస్ మీట్ల‌కు ప‌రిమితం అయ్యే బ్యాచ్ ఒక‌టి. రియ‌ల్ ఎస్టేట్‌, ఫైనాన్స్, చిట్టీలు, ఇత‌ర‌త్రా వ్యాపారాల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి క్ర‌మం త‌ప్ప‌కుండా ఆఫీస్ కు వచ్చే వాళ్లు రెండో బ్యాచ్. సీనియార్టీ ద‌ర్బాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి లైబ్ర‌రీకి వ‌చ్చి కూర్చొనే బ్యాచ్ మూడోది. ఓట్లు వేయించ‌డానికిగానీ, రాబట్ట‌డానికిగానీ ఏ మాత్రం ఈ మూడు ర‌కాల బ్యాచ్ లు ఉప‌యోగ‌ప‌డ‌వు.

కేవలం టీవీ స్క్రీన్ల‌పై షో చేయ‌డానికి మొద‌టి బ్యాచ్ ఉప‌యోగ‌ప‌డుతుంది. దానిలో కూడా రేటింగ్ ఉన్న వాళ్ల‌కు పెట్రోలు, డీజిల్ తో పాటు గిఫ్ట్ గా ఎంతో కొంత ఆశ‌చూపాలి. అందుకే, త‌రచూ మాజీ మంత్రి కొడాలి నాని ఆ విష‌యాన్ని మీడియా ఎదుట ప్ర‌స్తావిస్తుంటారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీచేసి గెలుపొందిన వాళ్లు ఒక్క‌రు కూడా ఈ బ్యాచ్ లో క‌నిపించరు. పోనీ, భ‌విష్య‌త్ లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దిగుతారా? అంటే ఏ మాత్రం కాదు. అధికారంలోకి వ‌స్తే, నామినేటెడ్ ప‌ద‌వులు ఉద్ద‌ర‌గా వ‌స్తే తీసుకునే బ్యాచ్ అన్న‌మాట‌.

ఇక రెండో బ్యాచ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల మాదిరిగా టీడీపీ ఆఫీస్ కు టంఛ‌ను గా వ‌స్తారు. జిల్లాల నుంచి వ‌చ్చే ద్వితీయ‌, తృతీయ శ్రేణి నాయ‌కులకు గాలం వేయ‌డం ద్వారా వ్యాపారాల‌ను పెంచుకోవ‌డం వాళ్ల ప‌ని. పార్టీలోని అనుబంధ విభాగాల‌కు చెందిన కీల‌క లీడ‌ర్ల‌ను అనుచ‌రులుగా పెట్టుకుంటారు. ఆర్థికంగా బ‌లంగా ఉన్న వాళ్లు పార్టీ ఆఫీస్ గ‌డ‌ప తొక్క‌గానీ ఆక‌ర్షించ‌డం ఈ బ్యాచ్ కు వెన్న‌తోపెట్టిన విద్య‌. స‌బ్ కాంట్రాక్టుల‌ను ఇప్పిస్తామ‌ని లేదా సంస్థాగ‌త ప‌ద‌వుల‌కు ప్ర‌మోట్ చేస్తామ‌ని వ‌చ్చిన వాళ్ల‌కు ఆశ పెడుతుంటారు. ఆయా జిల్లాల‌కు ఈ బ్యాచ్ వెళిన‌ప్పుడు లాడ్జింగ్ , బోర్డింగ్ ఏర్పాటు చేసేలా దిగువ శ్రేణికి త‌ర్ఫీదు ఇస్తుంటారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల‌ను ఈ బ్యాచ్‌ ప్ర‌మోట్ చేసుకుంటూ ఉంటారు. వెంచ‌ర్లు, ప్లాట్లు, ఇత‌ర‌త్రా భూముల వ్య‌వ‌హారాల వ్యాపారాలు చేస్తుంటారు. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల‌ను ర‌న్ చేసే వాళ్లు ఉంటారు. చిట్టీలు క‌ట్టించునే బ్యాంచ్ ఉంటుంది. ఇలా..ప‌లు ర‌కాల వ్యాపారాలు నిర్వ‌హించే నిమిత్తం టీడీపీ ఆఫీస్ ను అడ్డాగా చేసుకుని కుబేరులుగా మారిన లీడ‌ర్లు లేక‌పోలేదు.

మూడో బ్యాచ్ సీనియ‌ర్లుగా పేరున్న వాళ్లు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి స‌త్తాలేని వాళ్లు కొంద‌రు ఉన్నారు. సామాజిక ఈక్వేష‌న్ల‌ను చూపుతూ పార్టీ ఆఫీస్ లో చెలామ‌ణి అవుతుంటారు. మూడు, నాలుగు సార్లు వ‌రుస‌గా ఓడిపోయిన వాళ్లు సైతం పార్టీ మొత్తాన్ని తామే న‌డుపుతున్న‌ట్టు షో చేస్తుంటారు. అప్పుడ‌ప్పుడు మీడియాకు క‌నిపిస్తూ ప‌బ్బంగ‌డుపుతుంటారు. అదేమంటే, 1982 నుంచి పార్టీలోనే ఉన్నామంటూ చెబుతుంటారు. పోనీ, ఎక్క‌డైనా ఇప్ప‌టి వ‌ర‌కు పోటీ చేసి గెలుపొందారా? అంటే వాళ్ల నుంచి స‌మాధానం రాదు. కానీ, చంద్ర‌బాబు, లోకేష్ పేర్ల‌ను చెప్పుకుని పార్టీ ఆఫీస్ లో బ‌తుకుతుంటారు. జ‌నంలో ఉండే అస‌లైన లీడ‌ర్లు ఎప్పుడోగానీ పార్టీ ఆఫీస్ లో క‌నిపించ‌రు. ప్ర‌జాద‌ర‌ణ ఉన్న ధూళ్లిపాళ్ల న‌రేంద్ర‌, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్, ప‌య్యావుల కేశ‌వ్ త‌దిత‌రులు ఎవ‌రూ నిత్యం పార్టీ ఆఫీస్ లో ఉండ‌రు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటారు. కానీ, సీనియ‌ర్లుగా చెలామ‌ణి అవుతూ కొంద‌రు పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని వ‌ద‌లకుండా షో చేస్తుంటారు. వాళ్లే మూడో బ్యాచ్.

ఈ మూడు బ్యాచ్ ల గురించి చంద్ర‌బాబునాయుడుకు తెలియ‌ని విష‌యం కాదు. చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న సూచిచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అది ఆయ‌న మంచిత‌నం. కానీ, ఆ బ్యాచ్ ల కారణంగా పార్టీ అపార న‌ష్టం క‌లుగుతోంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన త‌రువాతే బ‌హుశా ఓట్లు వేయించ‌లేని లీడ‌ర్లు అవ‌స‌రంలేద‌నే నిర్ణ‌యానికి బాబు వ‌చ్చి ఉంటారు. అంతేకాదు, సీనియ‌ర్లను ప‌క్క‌న పెడ‌తాన‌నే సంకేతం ఇచ్చారు. ఈసారి యూత్ కోటాలో 40శాతం ఇస్తాన‌ని స‌భ్య‌త్వ న‌మోదు సంద‌ర్భంగా చెప్పారు. వార‌సులు కాకుండా ఉండే స‌మ‌ర్థుల‌ను ఈసారి ఎంపిక చేసుకుంటాన‌ని తేల్చాశారు. గ‌త ఎన్నిక‌ల్లో 1983 బ్యాచ్ కు చెందిన సీనియ‌ర్ల‌తో పాటు వాళ్ల పిల్ల‌ల‌కు దాదాపుగా టిక్కెట్ల‌ను ఇచ్చారు. వార‌సులంద‌రూ ఓడిపోయారు. ఈసారి మ‌ళ్లీ వాళ్ల‌కు టిక్కెట్లు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు మీద ఒత్తిడి వ‌స్తుంది. అందుకే, సీనియ‌ర్ల‌కు లేకుండా ఈసారి వార‌సుల‌కు మాత్ర‌మే అభ్య‌ర్థిత్వాల‌ను ప‌రిమితం చేసే అవ‌కాశం ఉంది. ఆ కోణం నుంచే స‌భ్య‌త్వ న‌మోదు సంద‌ర్భంగా బాబు సంకేతాలు ఇచ్చార‌ని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అవే కుటుంబాలు రాజ‌కీయాలు చేస్తున్నాయి. కొత్త‌గా ఎవ‌ర్నీ రానివ్వ‌డంలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ అంటేనే పాత మొఖాలు అనే ఆన‌వాయితీ ఉంది. పైగా గ‌త ఎన్నిక‌ల్లో 1983 బ్యాచ్ కి చెందిన లీడ‌ర్ల వార‌సులకు సగం సీట్ల‌ను కేటాయించారు. తెలుగుదేశం పార్టీలో స‌మ‌ర్థ‌వంత‌మైన కొత్త త‌రం ఉంది. వాళ్ల‌ను కేవ‌లం వ్యాపారాలు, ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు మాత్రమే పార్టీ ఆఫీస్ లోని కొంద‌రు వాడుకుంటున్నారు. రాజ‌కీయంగా కొత్త నాయ‌క‌త్వాన్ని ఎద‌గ‌నివ్వ‌డంలేద‌నే ఆరోప‌ణ చాలా కాలంగా ఉంది. దానికి చెక్ పెట్టేలా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లకు అనుగుణంగా ఈసారైనా న‌డుచుకుంటారా? లేదా అనేది చూడాలి.