Site icon HashtagU Telugu

CBN Delhi Tour: ఏపీ ప్రజలకు శుభవార్త.. విశాఖ రైల్వే జోన్ కు ముహూర్తం ఫిక్స్..

CBN Delhi Tour

CBN Delhi Tour

CBN Delhi Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఆయన ప్రధానితో దాదాపు గంటన్నరపాటు చర్చించారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు అందించేందుకు, పోలవరం ప్రాజెక్ట్ యొక్క తొలిదశ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంతేకాక, విభజన హామీలలో భాగంగా ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపినట్లుగా తెలిపారు.

ప్రధానితో భేటీ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖపట్నంలో శంకుస్థాపన జరుగుతుందని ఎంపీలకు వివరించారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ అనంతరం ఈ సమాచారాన్ని ఎన్డీయే కూటమి ఎంపీలతో పంచుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ప్రధాని మోదీని కలిశారు, ఈ భేటీ గంటన్నర పాటు కొనసాగింది.

ఢిల్లీ పర్యటనలో, సీఎం చంద్రబాబు అమరావతి మరియు పోలవరం నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలకు శాశ్వత పరిష్కారం, మరియు ఇటీవల వచ్చిన వరదల వల్ల కలిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర సాయంపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్-2047 విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి “ఆంధ్రా-2047 విజన్ డాక్యుమెంట్” రూపొందిస్తున్నామని ప్రధాని మోదీకి తెలిపారు. స్వాతంత్య్ర శత వసంతాల సందర్భంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి, వ్యక్తిగత ఆదాయాన్ని 43 వేల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని వివరించారు. ఈ లక్ష్యం సాధించడానికి కేంద్రం నుండి అవసరమైన సహాయం అందించాలి అని ప్రధాని మోదీ కి విజ్ఞప్తి చేశారు.

వరద సాయం అందించాలని ప్రధాని మోదీ కి చంద్రబాబు విజ్ఞప్తి:

సమీప కాలంలో భారీ వర్షాలు రాష్ట్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగా, బుడమేరు నది పొంగి విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత, ప్రధాని మోదీతో తొలిసారి సమావేశమైన సీఎం చంద్రబాబు వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి మరింత నిధులు మంజూరు చేసి సహాయపడాలని కోరారు.

అదే సమయంలో, పోలవరం ప్రాజెక్ట్ పనులను తిరిగి ప్రారంభించాలని, నవంబర్లో వరదలు తగ్గిన వెంటనే కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణ పనులను ప్రారంభించి, వేసవికి ముగించేందుకు అవసరమైన సహకారం ఇవ్వాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేశారనే సమాచారం ఉంది.

ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలవడంపై సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో స్పందించారు. ప్రధాని మోదీతో ఫలవంతమైన చర్చలు జరిగాయని తెలియజేశారు. పోలవరం రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించానని, ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు కేంద్ర మద్దతు ఉందన్నారు. అమరావతికి ప్రధాని మద్దతును అభినందిస్తున్నానని సీఎం తెలిపారు.

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలవడంపై ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు స్పందించారు. డిసెంబర్ నాటికి విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరగనున్నట్లు వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ హామీ నెరవేర్చిన రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపానని ఆయన తెలిపారు.

ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెంచేందుకు అంగీకరించారని, రైల్వే శాఖ రూ.73,743 కోట్ల పెట్టుబడులు ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. అలాగే, హౌరా-చెన్నై మధ్య 4-లేనింగ్ పనులు, 73 స్టేషన్ల ఆధునికీకరణ చేపట్టబడుతోందని వివరించారు.

రాష్ట్రంలో మరిన్ని లోకల్ రైళ్లు ప్రవేశపెట్టవచ్చని, ఏపీలో లాజిస్టిక్, కమ్యూటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసేందుకు రైల్వేతో భాగస్వామ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికపై చెప్పారు.

మంగళవారం, ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉంది. అమరావతి ORR సహా జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల గురించి చర్చించనున్నారు.

ఉదయం 11.30 గంటలకు కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశమయ్యాక, సాయంత్రం పీయూష్ గోయల్ మరియు హర్ దీప్ సింగ్ పూరిని కలవనున్నారు, అలాగే మంగళవారం రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం, రాత్రి 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా చంద్రబాబు సమావేశమవుతారు.