మాకు కక్ష రాజకీయాలు తెలియవని..రాష్ట్రాన్ని అభివృద్ధి (Development of the state) చేయడమే తెలుసనీ అన్నారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తమపై కక్ష కట్టారని, కక్ష రాజకీయాలు చేస్తున్నారని , కావాలని తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని జగన్ దగ్గరి నుండి వైసీపీ నేతలంతా పదే పదే అంటుండడం పై తాజాగా చంద్రబాబు స్పందించారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను సీఎం చంద్రబాబు ఖండించారు. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు కక్ష సాధింపు రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పటికీ, తాము ఆ దిశగా పని చేయడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ అసలైన లక్ష్యమని ఆయన వివరించారు. 2024లో ప్రజలు తమ ప్రభుత్వం మీద చారిత్రక నమ్మకం ఉంచారని , ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా తాము పాలన కొనసాగిస్తున్నామన్నారు. ఎవరిపైనైనా వ్యక్తిగత కక్షలు సాధించడం తమ విధానం కాదని, ఆ పని చేయడం వల్ల సమయం వృథా అవుతుందన్నారు. గత ప్రభుత్వ విధానాల్లో జరిగిన తప్పులను సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
జగన్(Jagan)పై కక్ష ఉంటే, ఆయనపై మొదటి రోజు నుంచే చర్యలు తీసుకునేవాళ్లమని చంద్రబాబు అన్నారు. సెకీ ఒప్పందం సహా అన్ని కేసుల్లో చట్టప్రకారం తప్పు చేసిన వారికి శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. అప్రజాస్వామిక చర్యలతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భరించుకుంటూ పరిస్థితిని చక్కదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ మహిళలను మరియు ఇతరులను కించపరిచే వారికి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఆ చర్యలను కక్ష సాధింపులుగా చెప్పడం సరైనది కాదన్నారు. అసభ్యమైన ప్రచారాలను కట్టడి చేయడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమని చెప్పారు. 2019లో జగన్ ఇచ్చిన మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు వంటి హామీలు అమలు కాలేదని చంద్రబాబు విమర్శించారు. జగన్ ప్రభుత్వం తప్పుడు హామీలతో ప్రజలను మోసగించిందని, గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని తెలిపారు. ఇప్పటికీ తాము ఆ సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
Projects: అభివృద్ధి పథంలో భారత్.. ఈ ప్రాజెక్టులే నిదర్శనం!