Case On Sureedu : ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడు.. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ వ్యక్తిగత సహాయకుడు. ఆయనపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో తనపై దాడిచేసి, ఇబ్బంది పెట్టిన మామ సూరీడు, ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరీడి అల్లుడు సురేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఆదేశం మేరకు వీరందరిపై కేసు నమోదైంది.
Also read : ACB Court Verdict : చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
అసలు ఈ కేసు విషయం ఏమిటంటే.. సూరీడు కుమార్తెను కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత సూరీడి కుమార్తె తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ క్రమంలో 2021 మార్చి 23న రాత్రి సురేందర్‌రెడ్డి తన కుమార్తెను చూడడానికి జూబ్లీహిల్స్‌లోని తన మామ సూరీడు ఇంటికి వెళ్లారు. అక్కడ మామా అల్లుళ్ల మధ్య గొడవ జరగ్గా.. అల్లుడిపై సూరీడు దాడిచేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి వెళ్లి సురేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సురేందర్‌రెడ్డి తనను చంపేందుకు యత్నించాడంటూ సూరీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేష్, ప్రస్తుతం ఏపీలో ఐజీగా పనిచేస్తున్న ఓ అధికారితో కలిసి తనను అక్రమంగా నిర్బంధించి దాడి చేశారని, తప్పుడు కేసులు బనాయించారని సురేందర్‌రెడ్డి ఆరోపించారు. వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు తలుపు తట్టారు.ఇరువర్గాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి.. సురేందర్‌రెడ్డి వాంగ్మూలాన్ని పరిశీలించి (Case On Sureedu) కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు.