Ambati Rambabu : పోలీసులను బెదిరించిన ఘటనలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. బుధవారం (జూన్ 4) గుంటూరులో జరిగిన “వెన్నుపోటు దినం” కార్యక్రమంలో జరిగిన సంఘటన ఈ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమాన్ని పార్టీ తరఫున నిర్వహించారు. అయితే, ర్యాలీ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి గుంటూరు సిద్ధార్థనగర్‌లోని తన నివాసం నుంచి ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్ వైపు బయలుదేరారు. మధ్యలో పోలీసులు వారిని ఆపడంతో ర్యాలీ దారి మళ్లించి వివేకానంద విగ్రహం వద్ద నుంచి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి దిశగా పోయారు. అక్కడ మరోసారి పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు.
Read Also: IPS Transfers : తెలంగాణలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ
ఈ సందర్భంలో పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ర్యాలీకి ముందస్తుగా అనుమతి తీసుకోలేదని, ఓవర్ బ్రిడ్జిపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరడం చట్టవిరుద్ధమని. కానీ, అంబటి రాంబాబు పోలీసుల ఆంక్షలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “ఎలా ఆపుతారో చూద్దాం” అంటూ కాస్త ఘాటుగా స్పందించారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు శాంతంగా స్పందిస్తూ, “మర్యాదగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి” అని హెచ్చరించారు. అయితే, అంబటి రాంబాబు అసహనం వ్యక్తం చేస్తూ పళ్లు కొరుకుతూ, నాలుక మడతపెట్టి పోలీసులను బెదిరించేలా వ్యవహరించారు. సీఐ ఘాటుగా స్పందిస్తూ, “ఇక్కడ మీ బెదిరింపులకు భయపడే వారు లేరు” అని స్పష్టం చేశారు.
రాజకీయ ర్యాలీలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి అవసరం. కానీ, అంబటి మరియు ఆయన అనుచరులు దీనిని లెక్కచేయకుండానే పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో అంబటి రాంబాబు సహా మరికొంతమంది వైఎస్సార్సీపీ నేతలపై IPC సెక్షన్ 353 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో అతనికి ఆటంకం కలిగించడం లేదా బెదిరించడం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు వీడియో ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులను సేకరిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. కాగా, వైఎస్సార్సీపీ వర్గాలు దీనిని రాజకీయ ప్రతీకారం భాగంగా పరిగణిస్తూ, పోలీసులు అతి వేగంగా స్పందించారని ఆరోపిస్తున్నాయి.