కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం చుట్టూ రాజకీయ రగడ తీవ్ర రూపం దాల్చింది. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో అక్టోబర్ 24న జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రమాదానికి నిజమైన కారణాలపై పోలీసులు స్పష్టమైన ఆధారాలు సేకరించినప్పటికీ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు విస్తరించాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపి, 27 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో వైసీపీ సీనియర్ నేత ఆరే శ్యామల, మాజీ ఎమ్మెల్యే సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణ, అలాగే వైసీపీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) పేజీ నిర్వాహకులు కూడా ఉన్నారు. వీరంతా ప్రమాదాన్ని “బెల్ట్ షాపులు, కల్తీ మద్యం” కారణంగా చూపుతూ పోస్టులు, వీడియోలు, మెసేజ్‌లు ప్రచారం చేశారని ఆరోపణ.
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
పోలీసులు విడుదల చేసిన వివరాల ప్రకారం, సంఘటన రోజున శివశంకర్ (25) అనే యువకుడు మద్యం సేవించి అధిక వేగంతో బైక్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. అతని స్నేహితుడు ఎర్రి స్వామి (22) వాంగ్మూలంలో కూడా ఈ అంశం స్పష్టమైంది. ఇద్దరూ డోన్ వైపు బయలుదేరినప్పుడు రోడ్డు డివైడర్‌ను బైక్ ఢీకొట్టి శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. స్వామి అతని మృతదేహాన్ని పక్కకు తరలించి, బైక్‌ను రోడ్డు మధ్యలో వదిలేశాడు. కొద్ది సేపటికే వచ్చిన కావేరీ బస్సు ఆ బైక్‌ను ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్‌లో శివశంకర్ బైక్‌కు ఇంధనం నింపుకుంటూ మద్యం మత్తులో కనిపించడంతో, ఈ కేసులో మద్యపానం మరియు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు.
అయితే ఈ ఘటన అనంతరం వైసీపీ నేతలు సోషల్ మీడియాలో “కల్తీ మద్యం వల్లే ప్రమాదం జరిగింది” అంటూ ప్రచారం ప్రారంభించారు. ఈ తప్పుడు ప్రచారం ప్రజల్లో గందరగోళం సృష్టించిందని, సమాజంలో విభేదాలు రేకెత్తించేలా ఉందని పోలీసుల అభిప్రాయం. అందుకే, సంబంధిత పోస్టులు, వీడియోలు, ఎక్స్ పేజీ కంటెంట్‌ను సేకరించి కేసులు నమోదు చేశారు. ఈ కేసులు IPC సెక్షన్ 153A (సామాజిక విభేదాలు రేకెత్తించడం) మరియు 505(2) (పబ్లిక్ మిస్‌చీఫ్ – ప్రజల్లో భయాందోళనలు కలిగించడం) కింద నమోదు అయ్యాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే, “అసత్య ప్రచారం చేసే వారెవరైనా ఉపేక్షించం, సాక్ష్యాలతో నిరూపించి కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఈ కేసు రాజకీయ వాతావరణంలో కొత్త ఉద్రిక్తతకు దారితీసింది.
