కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న హైడ్రామా తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడమే కాకుండా… మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై కేసు నమోదుకు కారణమైంది. కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో అంబటితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించారు. తమ కుటుంబ నిర్ణయం మేరకే సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని వారు స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య… అంత్యక్రియల వద్ద పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకోగా… విధుల్లో ఉన్న ఏఆర్ ఎస్సై అప్పలరాజు, తోటి కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము విధి నిర్వహణలో భాగంగా గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలు తమను వెనక్కి నెట్టివేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కిర్లంపూడి పోలీసులు అంబటి రాంబాబుపై BNS 132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
