టీడీపీ లో చేరాడని దళిత యువకుడిపై దాడి చేసిన ఘటనలో సినీ రచయిత కోన వెంకట్ ఫై కేసు నమోదు అయ్యింది. ఏపీలో మరికొద్ది గంటల్లో పోలింగ్ మొదలుకానుంది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. కొన్ని చోట్లా భారీగా డబ్బులు పంచుతూ ఓట్లను కొనుగోలు చేస్తుండగా..మరికొన్ని చోట్ల ఇన్ని రోజులు మా వెంట తిరిగి..ఇప్పుడు టీడీపీ లో చేరతావ అంటూ వారిపై దాడికి దిగుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో అదే జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
గణపవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి బంధువు, కర్లపాలెం మండలం వైసీపీ ఇన్‌ఛార్జి, సినీ రచయిత కోన వెంకట్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. కర్లపాలెం పోలీసుస్టేషన్లో శనివారం ఎస్సై జనార్దన్ సమక్షంలోనే వారు దాడికి పాల్పడటం గమనార్హం. కత్తి రాజేష్ తన అనుచరులతో కలిసి టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. రాజేష్ తమ వద్ద రూ.8 లక్షలకు పైగా డబ్బు తీసుకుని ఇప్పుడు టీడీపీ లో చేరారని కర్లపాలెం పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజేష్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఎస్సై ఛాంబర్‌లో ఎస్సై జనార్దన్ సమక్షంలో రాజేష్‌పై కోన వెంకట్, వైసీపీ నాయకులు దాడి చేశారు. ఎస్సై జనార్దన్ కూడా యువకుడిని కొట్టారు. ఈ విషయం తెలిసి టీడీపీ నేతలు కర్లపాలెం చేరుకున్నారు. యువకుడి కుటుంబసభ్యులు, గణపవరం ఎస్సీ కాలనీ వాసులు పోలీస్‌స్టేషన్ వద్ద కోన రఘుపతి, కోన వెంకట్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనపై జరిగిన దాడిపై రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజేష్‌పై దాడి చేసిన కోన వెంకట్, మార్పు బెనర్జీ, మార్పు రత్నం, కాగిత మోజెస్(మోషే), ఉపాధ్యాయుడు నక్కా సంతోష్, ఎస్సై జనార్దన్‌లపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also : Pavithra Jayaram : సీనియర్ నటి పవిత్ర మృతి..