Ram Gopal Varma : సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా గతంలో సోషల్ మీడియాలో రామ్‌గోపాల్ వర్మ పోస్టులు పెట్టడాన్ని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం తప్పుపట్టారు. దీనిపై ఆయన మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రామ్‌గోపాల్ వర్మపై(Ram Gopal Varma) కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు.
Also Read :Tunnel Under Cemetery : సమాధుల కింద రహస్య సొరంగం.. భారీగా ఆయుధాలు
గతంలో వర్మ ఏం చేశారంటే..
రామ్‌గోపాల్ వర్మ తీసిన పొలిటికల్ డ్రామా ‘వ్యూహం’. ఇది 2024 మార్చిలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఏపీ రాజకీయాలను ప్రధానంగా హైలైట్ చేశారు. దీనికి దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వాస్తవానికి ఈ మూవీని 2023 డిసెంబర్ 29న విడుదల చేయాలని రామ్‌గోపాల్ వర్మ భావించారు. అయితే ‘వ్యూహం’ మూవీకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్ పిటిషన్ వేశారు. సినిమా విడుదలను సైతం ఆపాలని కోరారు. అయినా ఈ అవాంతరాలను దాటుకొని 2024 మార్చిలో మూవీ విడుదలైంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రామ్‌గోపాల్ వర్మ పలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు అన్ని అంశాలు కవర్ చేసేలా వ్యూహం మూవీని వర్మ తీశారు. అయితే ఈ మూవీ విడుదలైన టైంలోనే ఎన్నికలు ఉండటం అనేది వివాదానికి దారితీసింది. రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై అప్పట్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. అందుకే ఆనాటి అంశాలను ఒక్కటొక్కటిగా తెరపైకి తెస్తున్నారు.