Botsa Satyanarayana: చంద్ర‌బాబు సొంత లాభం కోసమే అమ‌రావ‌తి..!

  • Written By:
  • Updated On - March 9, 2022 / 09:21 AM IST

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజ‌ధాని విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం ఇస్తుందని, అమరావతిని తాము శాసన రాజధానిగానే చూస్తామని బొత్స స‌త్య‌నారాయ‌ణ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ ప్ర‌భుత్వ‌ లక్ష్యమని, ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని బొత్స స్ప‌ష్టం చేశారు. ఇక‌ ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామ‌ని బొత్స పేర్కొన్నారు.

మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని బొత్స‌ అన్నారు. ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు తమ ప్రభుత్వానికి ప్రామాణికం కావని వెల్లడించారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో అడ్రస్ లేని వ్యక్తి పరిపాలన చేశారని పరోక్షంగా టీడీపీ అధినేత‌ చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించారని బొత్స స‌త్య‌నారాయ‌ణ గుర్తు చేశారు.

ఇక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య‌ల పై స్పందిస్తూ.. మనిషి పెరిగాడు కాని బుర్ర పెరగలేదని అచ్చెన్న పై బొత్స మండిపాడ్డారు. ఇక‌పోతే మరోవైపు మూడురాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇటీవ‌ల ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి అమరావతే రాజధాని అని స్పష్టం చేసింది. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని వెల్లడించింది. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ అంశాన్ని జ‌గ‌న్ ప్రభుత్వం కాస్త సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే అమరావతి ఒక్కటే కాదు, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక వివిధ సందర్భాల్లో వివిధ నిర్ణయాలపై న్యాయ వ్యవస్థ నుంచి ప్రతిరోధకాలు ఎదురవుతూ వస్తున్నాయి. న్యాయవ్యవస్థ జోక్యం కారణంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులు నిలిచిపోయాయనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గతంలోనే చాలాసార్లు శాసనసభ, న్యాయవ్యవస్థ అధికారాలపై చర్చ జరగాలని బాహాటంగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దీంత‌తో ఇప్పుడు అమరావతి హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఈసారి చ‌ర్చ‌య‌ తప్పనిసరి అని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంది.