Site icon HashtagU Telugu

ఏపీలో అంగన్వాడీకి పాలసరఫరా బంద్…కారణం ఇదే…?

ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఏపీలోని అంగన్వాడీలకు పాల సరఫరా నిలిపివేస్తున్నట్లు కెఎమ్ఎఫ్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం రూ.130 కోట్ల వరకు కెఎమ్ఎఫ్ కు బకాయి ఉంది. వీటిని తక్షణం చెల్లిస్తేనే పాల సరఫరా చేస్తామని తేల్చి చెప్పింది. దీనితో పాటు ఇకపై సరఫరా చేయాలంటే లీటరుకు రూ.5 రూపాయలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కర్ణాటక నుంచి పాల సరఫరా నిలిచిపోతే ఏపీలో సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా 20 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందకుండా పోతుంది. ఏపీ ప్రభుత్వం నందిని బ్రాండ్తో కేఎంఎఫ్ నుంచి ప్రతి నెలా 110 లక్షల లీటర్ల అల్ట్రా హై టెంపరేచర్ పాలను కొనుగోలు చేస్తోంది. అయితే గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి ఎలాంటి చెల్లింపులు చేయలేదని…ఇప్పటివరకు మొత్తం రూ. 130 కోట్లకు బకాయి చేరుకుందని కెఎమ్ఎఫ్ తెలిపింది. కేఎంఎఫ్, ఏపీ ప్రభుత్వంతో జూన్ 2020లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం సంపూర్ణ పోషణ పథకం ప్రభుత్వం సంక్షేమ పథకం కాబట్టి లీటరుకు వాస్తవ ధర కంటే రూ. 5 తక్కువకే సరఫరా చేస్తుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పాల సేకరణ ధర పెరుగుదల, డీజిల్ ధరల పెంపు, ప్యాకింగ్ వ్యయం పెరగడం, ఇతర ముడిసరుకులను దృష్టిలో ఉంచుకుని పాల ధరను లీటరుకు రూ. 5 పెంచాలని KMF, ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
అయితే ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం 2021 మే వరకు పాత ధరనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ అభ్యర్థనకు కెఎమ్ఎప్ అంగీకరించి… పాత ధరకు పాలను సరఫరా చేస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకం కాబట్టి పాల సరఫరా ధరను సవరించలేదని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్కు రాసిన లేఖలో కేఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ సతీష్ తెలిపారు.

కర్నాటక పాల సంఘాలు అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగా భారీ నష్టాలను చవిచూస్తున్నాయని, ఇంధన ధరల పెంపుతో తమ వర్కింగ్ క్యాపిటల్ మరియు లాభదాయకతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని సతీష్ చెప్పారు. ప్రస్తుత ధరకు పాలను సరఫరా చేయలేమని పాల సంఘాలు మాకు తెలియజేశాయని… అలాగే ఏపీ ప్రభుత్వం బకాయి
ఉండటం వల్ల పాల ఉత్పత్తిదారులకు సకాలంలో పాల బిల్లలు ఇవ్వలేకపోవతున్నామని ఆయన లేఖలో ప్రస్తావించారు.
కర్ణాటకలోని పాడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, లీటరుకు రూ.5 పెంచితే తప్ప ఏపీ అంగన్వాడీలకు పాలను సరఫరా చేయలేమని పాల సంఘాలు (కేఎంఎఫ్) తెలియజేశాయని ఆయన అన్నారు. పాల సంఘాలకు రావాల్సిన రూ.130 కోట్లు, మరో రూ.2.33 కోట్లను ఏపీ ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయాలని సతీష్ కోరారు. ఈ విషయమై గతంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధకు కేఎంఎఫ్ ఎండీ పలు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

Exit mobile version