ఏపీ సీఎం జగన్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో 4 లక్షల మందికి పింఛన్లను తొలగించడంపై ఏపీ సర్కార్ పింఛనుదార్లకు నోటీసులు అందించింది. ఏపీలో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇలా పింఛనుదారులను ఇబ్బందులు పెడుతూ వారికి నోటీసులు ఇవ్వడం ఎంత వరకూ సమంజసమని పవన్ ప్రశ్నించారు.
ఏపీలో పాతికేళ్లకు ముందు మరణించినవారు కూడా ఇప్పుడు ఆదాయపు కడుతున్నారని నోటీసుల్లో చూపిస్తూ వితంతువులకు పింఛన్లను రద్దు చేయడం సమర్థనీయమైనదేనా అని పవన్ ప్రశ్నించారు. పేదలకు బాధపెట్టకుండా చూడాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందని, దీనిని సీఎం జగన్ అర్థం చేసుకోవాలని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని మొళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్లను రద్దు చేస్తూ నోటీసులు అందజేశారని, వారి పేరు మీద వేలాది ఎకరాల భూములుంటే వెంటనే వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే పెనుకొండలో కూడా రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే మహిళకు 158 ఇళ్లు ఉన్నాయని నోటీసులిచ్చి పింఛను రద్దు చేయడం బాధాకరమన్నారు. ఆమెకు ఇల్లుంటే ప్రభుత్వమే దానిని చూపించాలని కోరారు. ఆమెకు సొంతిల్లు లేక గత కొన్ని రోజులుగా వాలంటీర్ల చుట్టూ తిరుగుతోందని, పేదలకు పింఛన్లు అందజేయడంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి నోటీసులిచ్చిన వారికి తిరిగి పింఛన్లను ఇవ్వాలని కోరారు. సర్కార్ తీరు మార్చుకోకుంటే తాము ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.