EC : ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయండి.. ఈసీని కలిసిన వైసీపీ ఎంపీలు!

ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గంజాయి అక్రమ రవాణాపై ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో

  • Written By:
  • Updated On - October 29, 2021 / 11:09 AM IST

ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గంజాయి అక్రమ రవాణాపై ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి సీఎంని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పట్టాభి నివాసంతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల పాటు దీక్ష నిర్వహించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం అక్టోబర్ 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది. ఏపీలో శాంతిభద్రతలు పడిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి తెలిపారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడికి పాలక ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమైందని, పోలీసు శాఖ వైసీపీ పార్టీ క్యాడర్గా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

రెండు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు ఢిల్లీలో మకాం వేయండంతో వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీకి వచ్చారు. టీడీపీకి కౌంటర్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్రని కలిసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామిక ప్రక్రియను దెబ్బతీస్తూ, ప్రజా స్వామ్యంపై పరుష పదజాలాన్ని తెలుగుదేశం పార్టీ ఉపయోగిస్తుందని..తక్షణం టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఉల్లంఘించిందని వైసీపీ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. బహిరంగ సభలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, టెలివిజన్ చర్చల ద్వారా అసభ్యకర పదజాలంతో రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీసే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది. రాష్ట్రంలో డ్రగ్స్ ఉందంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టి దానినే చీకటి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి తన ఎల్లో మీడియాను టీడీపీ ఉపయోగిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీలు లేఖలో ఆరోపించారు. ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించారని, వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా తయారైందని, ఏపీలో టెర్రరిస్టు అవుట్ ఫిట్గా చిత్రీకరించొచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. టీడీపీ నేతలు ఉపయోగిస్తున్న భాష, అసాంఘిక చర్యలు వివరించి, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశామన్నారు. ఇలాంటి పార్టీని ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించడం ద్వారా దొంగలు, టెర్రరిస్టులు.. ఎమ్మెల్యేలు, ఎంపీలైతే దేశం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు.