TTD Chairman: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి విషయంలో దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని టీటీడీ ఛైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో కొందరు దళారులు శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను అనేక మార్గాల ద్వారా మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. ముఖ్యంగా తాము టీటీడీలో లేదా కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులమని మాయమాటలు చెప్పి, మెరుగైన శ్రీవారి బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కల్పిస్తామని భక్తులను ప్రలోభపెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన అన్నారు.
ఇలాంటి నకిలీ వ్యక్తులు అమాయక భక్తుల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. భక్తులను మోసం చేస్తున్న దళారులను టీటీడీ ఇప్పటికే గుర్తించిందని, సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
టికెట్లు, సేవలకు ఆన్‌లైన్ మార్గమే సురక్షితం
“నా మనవి ఏమనగా.. భక్తులందరూ శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి వంటి టీటీడీ సేవలకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in లేదా ttdevasthanams మొబైల్ యాప్ ద్వారా మాత్రమే తమ ఆధార్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని” ఛైర్మన్ కోరారు. టీటీడీ సేవలు, సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257ను సంప్రదించాలని సూచించారు.
Also Read: No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్.. రోడ్డెక్కిన వేలాది మంది ప్రజలు!
ఎవరైనా దళారులపై అనుమానం వస్తే తక్షణమే టీటీడీ విజిలెన్స్ అధికారులకు 0877-2263828 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. “మనమందరం కలిసి తిరుమల పవిత్రతను, భద్రతను కాపాడుకుందాం” అని బీఆర్ నాయుడు భక్తులకు పిలుపునిచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ వివరాలు
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని, ప్రస్తుతం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు వారు పేర్కొన్నారు. కాగా నిన్న (శనివారం) 82,136 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 29,023 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా స్వామివారికి రూ.3.49 కోట్ల ఆదాయం లభించింది. భక్తులు దళారుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది.