AP Govt: ఏపీలో ఆ రూ. 48 వేల కోట్లు ఏమయ్యాయి..? 

రూపాయి కాదు రెండు రూపాయిలు కాదు.. ఏకంగా రూ.48 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ డబ్బుకు లెక్క చెప్పడం లేదు.

  • Written By:
  • Updated On - March 26, 2022 / 12:20 PM IST

రూపాయి కాదు రెండు రూపాయిలు కాదు.. ఏకంగా రూ.48 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ డబ్బుకు లెక్క చెప్పడం లేదు. అందుకే కాగ్ ఈ ఖర్చుకు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇంతకీ ఈ రూ.48 వేల కోట్లు ఏమయ్యాయి? ఎటు వెళ్లాయి? ఎవరు ఖర్చుపెట్టారు? మరి వాటికి లెక్కాపక్కా ఎందుకు లేదు? అసలు ఏపీ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ఖర్చుల విషయంలో పారదర్శకత లేదా?

కాగ్ అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ఆడిట్ సంస్థ. ఇది ఏటా ప్రభుత్వ ఆదాయవ్యయాలను ఆడిట్ చేస్తుంది. దాని ప్రకారం సర్టిఫికెట్ ఇస్తుంది. కానీ ఈసారి రూ.48 వేల కోట్ల రూపాయిలకు ఏపీ ప్రభుత్వం చెప్పిన లెక్కలు సరిగా లేవని కాగ్ గుర్తించింది. ఆ ఖర్చుకు సరైన వివరాలను కూడా ఏపీ సర్కార్ అందించలేకపోయింది. దీంతో లెక్కలు అంతు చిక్కనప్పుడు కాగ్ ఓ సర్టిఫికెట్ ఇస్తుంది. దాని పేరు క్వాలిఫైడ్ ఒపీనియన్. ఇప్పుడు జగన్ సర్కారుకు అదే ఇచ్చింది. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రానికీ ఇలాంటి క్వాలిఫైడ్ ఒపీనియన్ సర్టిఫికెట్ ను కాగ్ ఇవ్వలేదు. అసలు వాటికా పరిస్థితి రాలేదు. రూ.48 వేల కోట్ల రూపాయిలంటే మాటలు కాదు.

రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు 30 శాతం మొత్తమిది. ఏ కుటుంబమైనా ఓ రూపాయి ఖర్చుపెడితేనే పక్కాగా లెక్క రాసి పెట్టుకుంటుంది. అలాంటిది రూ.48 వేల కోట్ల రూపాయిలు ఎలా ఖర్చుపెట్టారో చెప్పలేకపోవడం అంటే దానిని ఏమనుకోవాలి అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన కాగ్ అకౌంట్స్ లో ఈ రూ.48 వేల కోట్ల ప్రస్తావన ఉంది. అయినా ఈమొత్తానికి లెక్కలు లేవని విపక్షాలు కొన్ని నెలల కిందటే చెప్పాయి. అప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన దానిని కొట్టిపారేశారు. మరిప్పుడు కాగ్ కూడా అదే విషయం చెప్పింది కదా. దాని గురించి ఏమంటారు? అందుకే రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలపై విచారణ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరుతామంది టీడీపీ.