తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ తెల్లవారుజామున రెండు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మొదటి ప్రమాదం కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద జరిగింది. ఉదయం 5 గంటల సమయంలో మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వడ్ల బస్తాలతో వెళ్తున్న ట్రాక్టరును వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీ కొట్టిన తీవ్రతకు బస్సు ముందు భాగం ధ్వంసమై, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం చోటుచేసుకున్న రహదారి కొద్దిసేపు మూసివేయబడగా, పోలీసులు ట్రాఫిక్‌ను సర్దుబాటు చేశారు.
1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి
ఇక మరో ప్రమాదం నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా ట్రాక్టరును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సాయంతో నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రహదారిపై పొగమంచు, రాత్రి వేళ దృశ్యమానత తగ్గడం, అలాగే వాహనదారుల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరు ప్రమాదాలపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా, అందులో సురక్ష (30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఐషర్ వాహనం అకస్మాత్తుగా బస్సు ముందు రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ రోడ్డు ప్రమాదాలు రాష్ట్రాల్లో రవాణా భద్రతపై ఆందోళనలను మళ్లీ పెంచాయి. నిపుణులు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి, తెల్లవారుజామున వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
