Site icon HashtagU Telugu

BRS Alliance : బీఆర్ఎస్, వైసీపీ పొత్తు? కేసీఆర్ కు జై కొట్టిన స‌జ్జ‌ల‌!

Jagan-KCR

ఏపీ (AP Govt) ప్ర‌భుత్వ  స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణ‌రెడ్డి బీఆర్ఎస్ (BRS) పార్టీని ఏపీ (AP Govt)కి ఆహ్వానించారు. ఆ పార్టీతో పొత్తు (Alliance) ప్ర‌తిపాద‌న వ‌స్తే ఆలోచిస్తామ‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికైతే, ఏ పార్టీతో పొత్తు లేకుండా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్నామ‌ని అన్నారు. ఒక వేళ బీఆర్ఎస్ (BRS) తో పొత్తు ప్ర‌స్తావ‌న వ‌స్తే అంద‌రితో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చర్చిస్తార‌ని న‌ర్మ‌గ‌ర్భంగా పొత్తు (Alliance)కు సంకేతాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఈనెల 14వ తేదీన మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ విజ‌య‌వాడ వెళ్ల‌నున్నారు. అక్క‌డ పార్టీ ఆఫీస్ ను బీఆర్ఎస్ పెట్ట‌బోతుంది. అక్క‌డ నుంచి రాజ‌కీయాల‌ను న‌డ‌ప‌డానికి సిద్ధ‌మ‌య్యామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. దీంతో కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌రికొత్త రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇప్పుడు ప‌రిస్థితుల్లో వై నాట్ -175 సాధ్యం కాద‌ని స‌ర్వే సంస్థ‌ల సారాంశం. అంతేకాదు, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత ఎక్కువ‌గా ఉంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్ర‌హించార‌ని పార్టీలోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. అందుకే, ఈనెల 16, 17 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో స‌మావేశమై కీల‌క దిశానిర్దేశం చేయ‌డానికి ఆయ‌న సిద్ధం అయిన‌ట్టు తెలుస్తోంది. సుమారు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యే గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింద‌ని స‌ర్వేల సారంశ‌మ‌ని తెలుస్తోంది. వాళ్ల‌కు టిక్కెట్లు లేవ‌ని చెప్ప‌బోతున్నార‌ని స‌మాచారం.

మూడు రాజధానుల అస్త్రం

ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతం మీద ఎక్కువ‌గా ఈసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆశ‌లు పెట్టుకున్నారు. మూడు రాజధానుల అస్త్రం ప‌నిచేస్తుంద‌ని భావిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన బీసీ స‌మ్మేళ‌నం ఫెయిల్ కావ‌డం, బీసీ మంత్రుల‌తో చేయించిన బ‌స్సు యాత్ర విఫ‌లం కావ‌డంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వైసీపీ అన్వేషిస్తోంది. అందుకే, గుజ‌రాత్ త‌ర‌హా ఫార్ములాతో ఎన్నిక‌ల‌కు ఫేస్ చేయ‌డానికి సిద్దం అయ్యారు. సుమారు 5.5 ల‌క్ష‌ల మంది గృహ సార‌థుల‌ను నియ‌మించ‌డం ద్వారా గ‌ట్టెక్కాల‌ని చూస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఉంద‌ని గ్ర‌హించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈసారి పొత్తుల‌కు తెరదీయాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలో అన్న‌దమ్ముల మాదిరిగా ఉన్న కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ, తెలంగాణాల్లో పొత్తు పెట్టుకుంటార‌ని తెలుస్తోంది.

ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో వెల‌మ సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉంది. అక్క‌డ బీసీలుగా వెల‌మ సామాజిక‌వ‌ర్గం ఉంది. వాళ్లు కేసీఆర్ సామాజిక‌వ‌ర్గం కావ‌డంతో సానుకూల ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక రాయ‌ల‌సీమ‌లోనూ కేసీఆర్ సామాజిక‌వ‌ర్గంతో పాటు రాజ‌కీయ మిత్రులు ఉన్నారు. వాళ్లంద‌ర్నీ క‌లుపుకుని బ‌ల‌ప‌డాల‌ని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. పైగా ఆంధ్రాలోని ప్ర‌తి కుటుంబానికి తెలంగాణ‌తో ప్ర‌త్య‌క్షంగా లేక ప‌రోక్షంగా సంబంధం ఉంది. రాజ‌కీయ నేత‌ల ఆస్తులు దాదాపుగా హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల ఉన్నాయి. వాటిని కాపాడుకోవ‌డం కోసం కేసీఆర్ ప‌క్షాన అనివార్యంగా నిలుస్తారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఉన్న కేసుల‌న్నీ తెలంగాణ ప‌రిధిలోనే ఉన్నాయి. ఆ క్ర‌మంలో కేసీఆర్ ను కాద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయాలు చేయ‌లేరు. అందుకే కేసీఆర్ కు ఏపీ ఆస్తుల‌ను ఉదారంగా క‌ట్ట‌బెట్టారు.

దూకుడుగా వెళుతోన్న కేసీఆర్

దేశ రాజ‌కీయాల్లో కీల‌కం కావాల‌ని దూకుడుగా వెళుతోన్న కేసీఆర్ కు అండ‌గా వైసీపీ నిల‌బ‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా స‌హాయ స‌హ‌కారాలు అందించిన కేసీఆర్ అంటే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గౌర‌వం. అంతేకాదు, కేసుల దృష్ట్యా భ‌యం కూడా ఉంద‌ని ప‌లువురు భావిస్తుంటారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య బ‌ల‌మైన రాజ‌కీయ సంబంధం ఉంది. ఆ దృష్ట్యా బీఆర్ఎస్, వైసీపీ పొత్తు ఉంటుంద‌ని వినిపిస్తోంది. దానికి బ‌లం చేకూరేలా స‌జ్జ‌ల కూడా బీఆర్ఎస్ ను ఆహ్వానిస్తూ పొత్తు ప్ర‌తిపాద‌న వ‌స్తే ఆలోచిస్తామ‌ని చెప్ప‌డం గ‌మనార్హం.