BRS : ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ కార్యాలయం.. జనవరిలో ప్రారంభం!

దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భారత రాష్ట్ర సమితి గా మారిన TRS..

Published By: HashtagU Telugu Desk
BRS

Brs In Andhra Pradesh

దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భారత రాష్ట్ర సమితి(BRS)గా మారిన TRS.. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కార్యాలయం తెరవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయడానికి ఏపీలో పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వెల్లడించాయి. ఏపీలో బీఆర్ఎస్ (BRS) వ్యవహారాలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకు అద్దె భవనం కోసం చూస్తున్నట్లు సమాచారం.

పార్టీ కార్యాలయాన్ని జనవరిలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించి, వేగవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ నెంబర్ కేటాయించారు. 9491015222 నెంబరుకు ఫోన్ చేసి పార్టీ సభ్యత్వం పొందవచ్చని ఇప్పటికే ప్రకటించారు.

గతంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు. అదే పద్ధతిని బీఆర్ఎస్ విషయంలోనూ పాటించాలని నేతలు భావిస్తున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన నాయకులను కలిసి బీఆర్ఎస్ లో చేరాలంటూ కేసీఆర్ కోరనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. గతంలో తనతో సన్నిహితంగా ఉన్న ఏపీ నేతలకు ఈ విషయంపై కేసీఆర్ ఇప్పటికే ఫోన్ చేసినట్లు వివరించారు.

Also Read:  TDP vs YCP : గుడివాడ‌లో పోటాపోటీగా వంగ‌వీటి రంగా వ‌ర్థంతి.. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు

  Last Updated: 26 Dec 2022, 01:29 PM IST