Site icon HashtagU Telugu

BRS Plan: ఏపీలో BRS ఎత్తుగడ! కాంగ్రెస్ తో కలిసి మహా కూటమి దిశగా..!

Brs Move In Ap! Towards Grand Alliance With Congress..!

Brs Move In Ap! Towards Grand Alliance With Congress..!

BRS Plan : బెంగాల్ సీఎం మమత తో సహా కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని సంకేతాలు ఇస్తున్న క్రమంలో ఏపీలో కూటమికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ ఎన్నికలు ముగిసిన తరువాత ఏపీలో కూటమి దిశగా అడుగులు వేయాలని ప్రణాళిక రచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టులతో కలిసి కూటమి కట్టాలని బీ ఆర్ ఎస్ ప్లాన్ (BRS Plan) చేస్తుందని తెలిస్తుంది. బీ ఎస్పీ ని కూడా కలువుకొని పెద్ద కూటమి ఏర్పాటుకు మాస్టర్ స్కెచ్ వేస్తున్నారు. ఒక వేళ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమి కడితే పోటీగా మహా కూటమికి ఈజీ అవుతుందని కేసీఆర్ ప్లాన్ . సహజ మిత్రునిగా ఉండే ఏం ఐ ఏం , కాంగ్రెస్, ఉభయ కమ్మునిస్ట్ పార్టీలు, బీ ఎస్పీ , ఆప్ ఇలా కలిసి వచ్చే పార్టీలను కూటమిగా ఏర్పాటు చేసి ఏపీలో పెద్ద శక్తిగా ఎదగాలని బీ ఆర్ ఎస్ (BRS) ఎత్తుగడ గా ఉందని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఏపీ ప్రజలు ఆదరించేలా ఉమ్మడి మేనిఫెస్టో ను రూపొందించడం ద్వారా సాధ్యమని భావిస్తున్నారు.

ఇలాంటి ప్లాన్ తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల‌ను BRS… భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ శాసిస్తుందా..? అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అంటేనే అగ్గిమీద గుగ్గిలం చందాన చిందులు వేసిన వాళ్లు… ఇప్పటికి ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై వ‌ల్ల‌మాలిన ప్రేమ చూపిస్తున్నారంటే ఎన్నో ర‌కాల అనుమానాలు సామాన్య మాన‌వుడు మొద‌లుకొని గ్రామాల్లో చెట్ల‌కింద కూర్చోని ముచ్చ‌ట్లు పెట్టే ముస‌లి వాళ్ల వ‌ర‌కూ ఇప్పుడు ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక నిన్న మొన్న‌టి వ‌ర‌కూ గొంగ‌డిపురుగు… సీతాకోక‌చిలుక మాదిరిగా టీఆర్ఎస్‌పార్టీ ఉన్న‌ట్టుండి బీఆర్ఎస్‌గా రూపాంత‌రం చెంద‌డంతో ఏపీ ప్ర‌జ‌లు అంత తొంద‌ర‌గా బీఆర్ఎస్ పార్టికి మ‌ద్ద‌తు ఇస్తారా? లేదా అనేది అనుమానమ‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సార‌ధిగా మాజీ ఐఏఎస్ అధికారి ప‌గ్గాలు చేప‌ట్టినా… ప్ర‌స్తుత రాజ‌కీయాలు అంత సుల‌భంగా లేనేలేవు. గత చ‌రిత్ర‌ను తిర‌గేసి చూస్తే లోక్‌స‌త్తా పార్టీని ప్రారంభించిన మాజీ ఐఏఎస్ అధికారి జ‌య‌ప్ర‌కాశ్‌నారాయ‌ణ‌ను అదే టీఆర్ఎస్ పార్టీ నేత‌లు సాక్షాత్తు అసెంబ్లీ స‌మావేశాల్లోనే దాడులు చేసిన సంఘ‌ట‌న ఇప్ప‌టికీ క‌ళ్ల‌ముందు క‌దులుతూనే ఉంది. ఒక సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి, జాతీయ‌స్థాయిలోని నేత‌ల‌కు రాజ‌కీయ స‌ల‌హాదారుడిగా… ఒక పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న జేపీపైనే దాడులు చేసిన సంఘ‌ట‌న‌ల న‌డుమ ఇప్పుడు ఆపార్టీనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ్యాధికారం కోసం బ‌రిలోకి దిగి, రాజ‌కీయాల‌ను శాసించాల‌ని అనుకోవ‌డం ఎండ‌మావిగానే మిగిలిపోతుంద‌నే బ‌ల‌మైన వాద‌న అన్ని వ‌ర్గాల నుండి వినిపిస్తోంది. ఒక‌వేళ కుల రాజ‌కీయాల‌పై మొగ్గు చూపించాల‌ని బీఆర్ఎస్ పార్టీ నేత‌లు భావిస్తే… ఎంత వ‌ర‌కూ త‌గిన ఫ‌లితాల‌ను ఇస్తాయ‌న్న‌ది కూడా అనుమానాస్ప‌ద‌మే.

ఇప్ప‌టికే అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష‌పార్టీ తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ, వామ‌ప‌క్ష‌పార్టీలు హోరాహోరీగా ఎన్నిక‌ల బ‌రిలో ఒక‌రికొక‌రు గ‌ట్టి పోటీని ఇస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అయితే నువ్వా… నేనా..? అన్న విధంగా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌స్తుతం రాజ‌ధాని అంశం అతిముఖ్య‌మైన స‌మ‌స్య‌. దీనిపై అధికార‌, ప్ర‌తిప‌క్ష‌పార్టీలు గ‌త నాలుగేళ్లుగా అభివృద్ధిని ప‌క్క‌న‌పెట్టి… స‌వాళ్లు… ప్ర‌తి స‌వాళ్ల‌తోనే కాలం వెళ్ల‌దీసార‌న్న అపోహ ప్ర‌జ‌ల్లో నాటుకుపోయింది. 10 ఏళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేటాయిస్తేనే గ‌గ్గోలు పెట్టిన తెలంగాణ ప్రాంత నేత‌లు ఇప్పుడు 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను ఏమ‌ని చెప్పి ఓట్లు అడుగుతారు…? రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో అస‌లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయే అంచ‌నా వేశారా? ఇంత వ‌ర‌కూ రాష్ట్రంలో ఏ ఒక్క‌జిల్లాలోనూ పార్టీ కార్యాల‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించ‌నే లేదు.

ఏడాదిలోపు జ‌రిగే ఎన్నిక‌లు తాము సిద్ధంగా ఉన్నామ‌నే సంకేతాలు ఇవ్వ‌డం దేనికి నిద‌ర్శ‌నం…? 10 ఏళ్ల ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్‌లో ఆంధ్రప్ర‌దేశ్‌రాష్ట్రానికి సంబంధించిన అన్ని స‌మ‌యాల్లో… సంద‌ర్భాల్లో… అన్ని అనుమ‌తులు ఇచ్చారా? అస‌లు ఏపీకి చెందిన ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను ఇక్క‌డ కొన‌సాగించేందుకు స‌హ‌క‌రించారా? రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం లోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్క‌న్న అంశాలు ఇప్ప‌టికీ అప‌రిష్కృతంగానే మిగిలి పోయాయి. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జీవ‌నాధార‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన బీఆర్ఎస్ పార్టీ. ఏపీకి చెందాల్సిన ఆస్తుల‌ను ఇప్ప‌టికీ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో అంద‌జేయ‌నే లేదు.

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 9 ఏళ్లు గ‌డుస్తున్నా… ఆంధ్రా తెలంగాణ మ‌ధ్య ఎన్నో స‌మ‌స్య‌లు ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందాని ఉండిపోయాయి. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సంబంధించిన అంశాల‌ను చ‌ర్చించ‌కుండా… తాత్కాలిక ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని, రాజ‌కీయ అధికారాన్ని చేజిక్కించుకోవ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లు నిశితంగానే గ‌మ‌నిస్తూ ఉన్నారు. రాజ‌కీయ‌పార్టీల మ‌ధ్య వైరం ఎప్పుడూ ఉంటుంది. కానీ దేశంలోని ప్ర‌జ‌లంద‌రూ క‌లిసిమెల‌సి ఉండ‌ల‌న్న ల‌క్ష్యంతోనే నేత‌లు ప‌నిచేయాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంది. చుట్టూ ఇన్ని స‌మ‌స్య‌లు… అనుమానాలు… అపోహ‌ల‌ను ముందుంచుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌లు సిద్ధం కావ‌డం ఒక్కింత ఆలోచించాల్సిన విష‌య‌మే.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర భ‌విష్య‌త్తుకు సంబంధించిన అన్ని అంశాల‌ను ప‌రిగణ‌లోకి తీసుకొని ఏపార్టీ అయినా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చిన త‌రువాత బ‌రిలోకి దిగి త‌మ బ‌లాబ‌లాల‌ను తేల్చుకోవ‌చ్చు. కానీ ఇక్క‌డ బిఆర్ఎస్ పార్టీ ఏపీలో అడుగు పెట్టాలంటే అడుగ‌డుగునా స‌వాళ్లే ముందున్నాయి. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని ముందుకు దూసుకుపోగ‌ల‌దా..? తెలంగాణ రాష్ట్రంలో అతి వేగంగా ప‌రుగులు పెట్టే కారు ఆంధ్రాలోని రోడ్ల‌పై అంత సులువుగా వెళ్ల‌గ‌ల‌దా..? అన్న అనుమానాలు ప్ర‌తీ ఒక్క ఓట‌రు మ‌దిలో మెదులుతూనే ఉన్నాయి. కేవ‌లం రాజ‌కీయ‌పార్టీల నేత‌లే కాదు… రాష్ట్రంలోని ప్ర‌తీ ఒక్క‌రూ అదే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

బీఆర్ఎస్ పార్టీ 2024 ఎన్నిక‌ల్లో పోటీకి చేయ‌డానికి అభ్య‌ర్థులు క‌రువు లేక‌పోవ‌చ్చు… ఎందుకంటే.. ఇప్పుడున్న తాజా ప‌రిస్థితుల్లో జంపింగ్ జ‌పాంగ్‌లు బాగానే ఉన్నారు. అధికార‌పార్టీ వైకాపా నుండి టిడిపిలోకి… టిడిపి నుండి వైకాపా లోకి… అలాగే జ‌న‌సేన‌, బీజేపీ పార్టీల్లో చేర‌డానికి ఆశావాహులు బాగానే ఉన్నారు. ఈ జంపింగ్ జ‌పాంగ్‌లకు కావ‌ల‌సింద‌ల్లా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం… అదృష్టం ఉండి గెలిస్తే ఆ త‌రువాత‌… అధికారంలోకి వ‌చ్చే పార్టీలోకి మ‌ళ్లీ జంపింగ్ జ‌పాంగే… ఇదీ వారి వ‌రుస‌. ఈ నేప‌థ్యంలో ఏపార్టీకి అయినా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డానికి అభ్య‌ర్థుల కొర‌త మాత్రం ఉండ‌దు. కానీ గెలుపు ఓట‌ముల‌ను శాసించే ఓటింగ్‌పై వీరి ప్ర‌భావం ప‌డ‌టంతో పాటు ఓట్లు చీలిపోవ‌డం కూడా స‌హ‌జ‌మే.

అయితే పోటీలో ఉన్న అభ్య‌ర్థులు కొన్ని సంద‌ర్భాల్లో అంత‌ర్గ‌త ఒప్పందాలకు లోబ‌డి మిడిల్ డ్రాప్‌ల సంఖ్య కూడా బాగానే ఉంటుంది. ఈ ప‌రిణామాల‌పై అన్ని రాజ‌కీయ‌పార్టీలు ఇప్ప‌టి నుండి తీవ్ర ఆందోళ‌న చెందుతూనే ఉన్నాయి. ఇప్పుడు మూలిగే న‌క్క‌పై తాటిపండు పడింద‌న్న చందాన కొత్త‌గా ఏపీ రాజ‌కీయాల్లో బీఆర్ఎస్‌… పార్టీ అరంగేట్రం. ఆంధ్రా ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌ను ఆదరిస్తారా…? లేదా అన్న‌ది మిలియన్ డాలర్ల ప్రశ్న . కానీ 2019 ఎన్నికల్లో తాను చూపిన జగన్ కు ఓటు వేసిన వాళ్ళు ఇప్పుడు నేరుగా తానే రంగంలోకి దిగితే ఓట్లు రాలుతాయని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే మహాకూటమి దిశగా కేసీఆర్ ఏపీ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు.

Also Read:  Jagan Speech: జగన్ స్పీచ్ లో ‘ముందస్తు’ స్వరం