BRS KTR: బీఆర్ఎస్ ఎత్తుగ‌డ‌! భీమ‌వ‌రంలో కేటీఆర్, గ‌న్నవ‌రంకు వ‌ల్ల‌భనేని?

  • Written By:
  • Updated On - October 14, 2022 / 12:43 PM IST

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో పోటీ చేయాల‌ని మంత్రి కేటీఆర్ ఊబ‌లాట ప‌డుతున్నారు. అలాంటి సంకేతాల‌ను రెండేళ్ల క్రిత‌మే ఇచ్చేశారు. అప్పుడ‌ప్పుడు మ‌నోభావాన్ని బ‌య‌ట‌పెడుతూ సంక్రాంతి పండుగ‌లా తెలుగు రాజ‌కీయాన్ని చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. అందుకే, తెలుగు రాష్ట్ర స‌మితిగా టీఆర్ఎస్ పార్టీని ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న అభివ‌ర్ణించారు.

గుంటూరు కేంద్రంగా రాజ‌కీయాలు చేయాల‌ని చాలా కాలంగా క‌విత‌కు ఇట్ర‌స్ట్ ఉంద‌ని ఆమె అనుచ‌రులు చెబుతుంటారు. ఎందుకంటే, అక్క‌డే కేటీఆర్, క‌విత చ‌దువుకున్నారు. ఆ మ‌మ‌కారంతో అక్క‌డ సేవ‌లు చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నార‌ట‌. ప్ర‌త్యేక హోదాకు వ్య‌తిరేకం కాదంటూ ఆమె ప‌లుమార్లు ప్ర‌స్తావించారు. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం లేదా విశాఖ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని కేసీఆర్ ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ప్ర‌శాంత్ కిషోర్ కొన్ని స‌ర్వేల‌ను కూడా అందించార‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాల్లోని టాక్‌.

తెలంగాణ నుంచి పోటీ చేయ‌డానికి జేసీ బ్ర‌ద‌ర్స్ అవ‌కాశం కోసం చూస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తాన‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌స్తావించారు. రాయ‌ల తెలంగాణ కోసం రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆయ‌న చాలా ప్ర‌య‌త్నం చేశారు. ఈసారి రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల ప‌రిధిలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏపీకి సంబంధించిన లీడ‌ర్ల‌ను బ‌రిలోకి దించాల‌ని బీఆర్ఎస్ చీఫ్ యోచిస్తున్నార‌ట‌.

ఏపీలోనూ బీఆర్ఎస్ అభ్య‌ర్థులుగా కొంద‌ర్ని కేసీఆర్ ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ జాబితాలో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఉన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యేగా ఆయ‌న ఉన్నారు. కానీ, వైసీపీ పంచ‌న అన‌ధికారంగా ప‌నిచేస్తున్నారు. దీంతో అక్క‌డ ప్ర‌జ‌లు వైసీపీ త‌ర‌పున పోటీ చేస్తే అంగీక‌రించ‌ర‌ని స‌ర్వేల ద్వారా తేలింద‌ని వినికిడి. అందుకే, బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ఈసారి గ‌న్న‌వ‌రం నుంచి వంశీ పోటీకి దిగుతార‌ని స‌రికొత్త ప్ర‌చారం మొద‌లైయింది.

టీడీపీ రెబ‌ల్స్, వైసీపీ అసంతృప్తి వాదులు చాలా మంది ఈసారి బీఆర్ఎస్ త‌ర‌పున ఏపీలో పోటీ చేయ‌డానికి అవకాశం ఉంది. అంతేకాదు, వాళ్ల‌కు మ‌ద్ధ‌తుగా కేటీఆర్, కేసీఆర్ , క‌విత కూడా ఏపీ నుంచి ఎంపిక చేసుకున్న స్థానాల్లో బ‌రిలోకి దిగుతార‌ని తెలుస్తోంది. మొత్తం మీద ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు అటూఇటూ తేడా లేకుండా జంబ‌ల‌కిడి పంబ సీన్ ను చూసే అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌.