Site icon HashtagU Telugu

Brother Anil Kumar : వైఎస్ కుటుంబం పొలిటికల్ హిట్ ఫార్ములానే బ్రదర్ అనిల్ ఫాలో కాబోతున్నారా? అదేంటి?

Anil Jagan

Anil Jagan

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డికి అభిమానులు ఎక్కువ. కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగత ఇమేజ్ కూడా ఆయనకు ప్లస్. ఆయన అనుసరించిన ఒకే ఒక లెక్క వైఎస్ ను అంత ఎత్తుకు ఎదిగేలా చేసింది. దాంతో ఆయన బాగా లబ్ది పొందిన మాట నిజం. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్ కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యారు. ఇప్పుడు షర్మిలా కూడా దానినే అనుసరించబోతున్నారు. త్వరలో రాజకీయ పార్టీ పెడతారని భావిస్తున్న బ్రదర్ అనిల్ కూడా ఆ ఫార్ములాతోనే జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.

వైఎస్ ఎక్కడ సభ పెట్టినా సరే.. దానికి భారీగా జనాలను సమీకరించేవారు. అంటే ఆ సభను చూసేవారు ఎవరైనా సరే.. ఆయనకు ప్రజా మద్దతు అధికంగా ఉండేదని భావించేవారు. అలాంటి పాజిటివ్ అభిప్రాయం ఉండడం వల్ల తరువాతి రోజుల్లో అది ఓటు బ్యాంకుగా మారుతుందని ఆయన నమ్మేవారంటారు. అదే ఫార్ములా జగన్ కు వర్కవుట్ అయ్యింది. వైఎస్ తరువాత ప్రజల్లోకి వచ్చిన జగన్ కూడా ఈ సమీకరణంతోనే సక్సెస్ అయ్యారు.

జగన్ ఓదార్పు యాత్రలో కాని, పాదయాత్రలో కాని.. ఎక్కడ చూసినా జనాన్ని బాగా సమీకరించుకునేవారు. ఒక్కోసారి జనం పెద్దగా రాలేదని భావిస్తే సభలు క్యాన్సిల్ చేయమని చెప్పేవారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడిచేది. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి వచ్చిన షర్మిల కూడా తన సభలకు భారీగా జనం వచ్చేలా చూసుకుంటున్నారు. తరువాతి రోజుల్లో అన్నతో విభేదించి పార్టీ పెట్టిన తరువాత కూడా తమ కుటుంబం సక్సెస్ ఫార్ములాను వదిలిపెట్టలేదు.

షర్మిల తన ప్రజాప్రస్థానం రెండో విడత కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం కొండపాక గూడెం గ్రామంలో ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా అక్కడే ఓ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో షర్మిల తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఆ సభలో చూస్తే ప్రజలు ఎలా వచ్చారో.. వారు నిండుగా కనిపించేలా ఎలా సర్దుబాటు చేశారో తెలుస్తుంది. జగన్ కూడా తన సభల్లో జనం నిండుగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకునేవారు. అంటే పార్టీలు వేరైనా వీరిద్దరికీ సక్సెస్ ను అందించింది మాత్రం ఈ ఫార్ములానే అని చెప్పాలి.

ఇప్పుడు బ్రదర్ అనిల్ కూడా తన మావగారు, బావగారు, భార్య అనుసరించిన ఫార్ములాతోనే జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. అయినా భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం బ్రదర్ అనిల్ కు కొత్త కాదు. కాకపోతే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారితే మాత్రం.. జనసమీకరణలో ఈ ఫార్ములా వర్కవుట్ అవుతుందని ఆయన సన్నిహితులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే దానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జగన్, షర్మిల మధ్య విభేదాల తరువాత వైఎస్ఆర్ భార్య విజయమ్మ షర్మిలకు తోడునీడగా ఉంటున్నారు. అందుకే షర్మిల సభల్లో ఆమె కనిపిస్తున్నారు. అప్పట్లో జగన్ తరపున ప్రచారం చేసినప్పుడు కూడా విజయమ్మ సభలకు వారి కుటుంబం ఈ ఫార్ములానే ప్రయోగించారు. సక్సెస్ అయ్యారు. వచ్చే మే నెల నుంచి ఏపీ సీఎం జగన్ కూడా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. అప్పుడు కూడా ఇదే ఫార్ములా అనుసరించే అవకాశం ఉంది. సో.. రాజకీయ ప్రయాణంలో వైఎస్ కుటుంబాన్ని విజయతీరాలకు చేర్చిన ఆ ఫార్ములాను మాత్రం వారు విడిచిపెట్టేది లేదని అర్థమవుతోంది.

Exit mobile version