స‌ర్టిఫికేట్ల‌తో ఫీజుల దందా..ప్రైవేటు యాజ‌మాన్యాల ఇష్టారాజ్యం

స్కూల్ ఫీజులు, స‌ర్టిఫికేట్ల‌కు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు లింకు పెట్టేశాయి. ప్రైవేటు యాజ‌మాన్యాల దెబ్బ‌కు విద్యార్థులు, పేరెంట్స్ నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 25, 2021 / 01:50 PM IST

స్కూల్ ఫీజులు, స‌ర్టిఫికేట్ల‌కు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు లింకు పెట్టేశాయి. ప్రైవేటు యాజ‌మాన్యాల దెబ్బ‌కు విద్యార్థులు, పేరెంట్స్ నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు. స‌గం ఫీజు చెల్లిస్తే, ఆరు నెల‌లు చ‌దివిన‌ట్టు స‌ర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఫ‌లితంగా విద్యా సంవ‌త్స‌రాన్ని పిల్ల‌లు కోల్పోతున్నారు. దీంతో స్కూల్ కు పిల్ల‌లు వెళ్ల‌న‌ప్ప‌టికీ ఏడాదికి ఫీజులు చెల్లించాల్సి వ‌స్తోంది.
క‌రోనా కార‌ణంగా గ‌త ఏడాది స్కూల్స్ జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల వ‌ర‌కు స్కూల్స్ లేవు. కొన్ని స్కూల్స్ ఆన్ లైన్ క్లాసుల‌ను నిర్వ‌హించాయి. మ‌రికొన్ని ఎలాంటి త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించ‌లేదు. గ‌త ఒక‌టిన్న‌ర ఏడాదిగా ఇలాగే జ‌రుగుతూ వ‌చ్చింది. 2019 మార్చి నుంచి స్కూల్స్ స‌క్ర‌మంగా జ‌ర‌గలేదు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. కానీ, త‌ర‌గ‌తుల ప‌దోన్న‌తి క‌ల్పించ‌మ‌ని ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం యాజ‌మాన్యాలు న‌డుచుకున్నాయి. ఫీజుల విష‌యంలో మాత్రం స‌ర్టిఫికేట్ల‌కు లింకేసి యాజ‌మాన్యాలు కిరికిరి చేస్తున్నాయి.
ప్ర‌భుత్వం ఆర్డ‌ర్ ప్ర‌కారం ప్రైవేటు యాజ‌మాన్యాలు పై త‌ర‌గ‌తుల‌కు పంపిస్తూ స‌ర్టిఫికేట్లు ఇవ్వాలి. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలు చాలా వ‌ర‌కు భారీ స్థాయి ఫీజులు ఇస్తేనే స‌ర్టిఫికేట్ల‌ను ఇస్తున్నాయి. లేదంటే స‌గం ఏడాది చ‌దివిన‌ట్టు స‌ర్టిఫికేట్ల‌ను జారీ చేస్తున్నారు. వాటి ఆధారంగా మ‌రో స్కూల్ లో చేరాలంటే కుద‌రడంలేదు. మ‌ళ్లీ అదే త‌ర‌గ‌తిలో అడ్మిష‌న్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.
ప్రైవేటు యాజ‌మాన్యాల ఫీజుల జులుం వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోలేదు. క‌రోనా స‌మ‌యంలో ఆర్థికంగా చాలా కుటుంబాలు దెబ్బ‌తిన్నాయి. పిల్ల‌ల‌కు ఫీజులు క‌ట్ట‌లేని పరిస్థితుల్లో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ. స్కూల్స్ యాజ‌మాన్యాలు ఫీజులను డిమాండ్ చేస్తున్నాయి. స‌ర్టిఫికేట్ తీసుకుని వేరే స్కూల్స్ వెళ్ల‌డానికి గ‌త ఏడాది ఫీజులు మొత్తం చెల్లించాల‌ని కండీష‌న్ పెడుతున్నారు. దీనిపై ప్ర‌భుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేరెంట్స్ కోరుతున్నారు.