Breaking: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమాదేవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. రమాదేవి(Breaking) ప్రస్తుతం హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నారు. ఇవాళ (సోమవారం) ఆమె రాయచోటి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు.
Also Read :7 Foot Conductor: 7 అడుగుల బస్ కండక్టర్‌కు ఊరట.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
మృతి చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో పీలేరు రెవెన్యూ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు హాజరయ్యేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో సుగాలి రమాదేవి మరణించడం చాలా దురదృష్టకరమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.
Also Read :Prudent Electoral Trust: బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రుడెంట్ ట్రస్ట్ రూ.880 కోట్ల విరాళాలు.. ఇది ఎవరిది ?
మంత్రులు నారా లోకేశ్, మండిపల్లి రాంప్రసాద్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్‌తో ఫోన్లో మాట్లాడిన మంత్రి మండిపల్లి, ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో సుగాలి రమాదేవి చాలా నిబద్ధతతో వ్యవహరించే వారని అధికార వర్గాలు తెలిపాయి.