Site icon HashtagU Telugu

Tirumala Darshan Tickets : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్లతో బ్రేక్ దర్శనం స్కాం..!

Tirumala Darshan

Tirumala Darshan

VIP Break Darshan Ticket : తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించి భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లతో నకిలీ లెటర్ ప్యాడ్‌లు తయారు చేసి, ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు దళారులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దర్శనాలు బుక్ చేసుకోవాలని సూచించారు.

తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో నకిలీ సిఫార్సు లేఖలతో భక్తుల్ని బురిడీ కొట్టిస్తున్నారు ఇద్దరు వ్యక్తులు. కొంతకాలంగా ఈ లేఖల దందా చేస్తుండగా.. భక్తులను మోసం చేస్తు ఆన్న ఇద్దరు వ్యక్తులను తిరుమల టూటౌన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లతో నకిలీ లెటర్‌ ప్యాడ్‌లు తయారు చేసి, వీఐపీ బ్రేక్‌ దర్శనం ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిని తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన బల్లి ప్రవీణ్‌ కుమార్‌, దేవత చెంచు బాలాజీగా గుర్తించారు.

ఈ మోసగాళ్లు ఇద్దరు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి పేర్లతో నకిలీ లెటర్ ప్యాడ్‌లను తయారు చేశారు. వీటి సాయంతో హైదరాబాద్‌కు చెందిన భక్తుల్ని సంప్రదించి.. ఈ నకిలీ లేఖలతో వీరు మోసాలకు పాల్పడుతున్నారు. భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు వీరిపై నిఘా ఉంచి పట్టుకున్నారు. నిందితుల నుంచి నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించిన డేటాతో పాటుగా ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, మొబైల్స్, బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు, రూ.వెయ్యి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఇద్దరు కేటుగాళ్లపై తిరుపతి జిల్లా గూడూరు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్, తిరుమల టూటౌన్‌ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. పోలీసుల దర్యాప్తులో వీరు మరికొన్ని మోసాలకు పాల్పడినట్లు తేలింది. పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నారు. కొందరు భక్తులు దర్శనం కోసం తిరుమల వెళ్లాక మోసపోయామని గుర్తిస్తున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరైతే శ్రీవారి దర్శనం క్యూ లైన్లలోకి వెళ్లిన తర్వాత నకిలీ టికెట్లు అని తెలిసి వెనక్కు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా భక్తుల్ని కేటుగాళ్లు తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో మోసం చేస్తున్నారు.

టీటీడీ పదే, పదే దళారుల్ని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూనే ఉంది. అయినా సరే కొందరు భక్తులు తిరుమల శ్రీవారి వీపీఐ దర్శనం కోసం దళారుల్ని సంప్రదిస్తున్నారు.. మోసపోతున్నారు. భక్తులు దళారుల మాటలు నమ్మొద్దని.. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దర్శనాలు, వసతి గదుల్ని బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాల పేరుతో ఇచ్చే సిఫార్సు లేఖల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఒకవేళ ఎవరైనా దళారులు దర్శనం కల్పిస్తామని చెబితే.. వారి సమాచారాన్ని వెంటనే టీటీడీకి తెలియజేయాలని సూచిస్తున్నారు. గతంలో కూడా పలువురు దళారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. అయినా సరే కొందరు ఇంకా భక్తుల్ని మోసం చేస్తూనే ఉన్నారు.

Exit mobile version