Rajdeep Sardesai రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం, కానీ ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేయడం చాలా అరుదు. నారా లోకేష్ సరిగ్గా ఈ పని చేసి చూపించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ ముస్లిం కుటుంబానికి ఏడాది క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చి, వారి సొంతింటి కలను నిజం చేశారు. దేశంలో మతపరమైన విభజన పెరుగుతున్న తరుణంలో, ఓ నాయకుడు మతాలకు అతీతంగా ఇలాంటి గొప్ప పని చేయడంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు.
లోకేష్ హామీ నెరవేర్చడంపై ప్రత్యేకంగా ట్వీట్ చేశారు రాజ్‌దీప్ సర్దేశాయ్. దేశవ్యాప్తంగా మతపరమైన విభజన రాజకీయాలు నడుస్తున్న వేళ, ఆంధ్రప్రదేశ్‌లో నారా లోకేష్ చేసిన ఈ పని సానుకూల మార్పుకు సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన మాట మరిచిపోకుండా, ముస్లిం కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడం ద్వారా లోకేష్ మానవత్వాన్ని చాటుకున్నారని చెప్పారు.
ఇండియా టుడేలో ఓ ప్రత్యేక కథనం కూడా ప్రసారమైంది. రంజాన్ సమయంలో లోకేష్ చేసిన ఈ సహాయం ఓ వర్గానికి చేసిన మేలు మాత్రమే కాదని, సమాజంలో మత సామరస్యాన్ని పెంచే ప్రయత్నమని విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. ‘ప్రామిస్ మేడ్ – ప్రామిస్ ఫుల్‌ఫిల్డ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జాతీయ స్థాయిలో లోకేష్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
గతేడాది రంజాన్ వేళ లోకేష్ ఓ నిరుపేద ముస్లిం ఇంటికి ఇఫ్తార్ విందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను, వారి ఇంటి పరిస్థితిని చూసి లోకేష్ చలించారు. ఆ కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటానని, వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఏడాది తిరగకముందే ఆ పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేశారు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఆ ఇంటిని చూసి ఆ ముస్లిం కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ పండుగ వేళ తమకు ఇంతటి గొప్ప బహుమతిని అందించిన మంత్రి లోకేష్‌కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
