Site icon HashtagU Telugu

Organs Donate : తాను చ‌నిపోతూ ఐదుగురికి పున‌ర్జ‌న్మ‌నిచ్చిన య‌వ‌తి.. శ్రీకాకుళం జిల్లాలో బ్రెయిన్ డెడ్ య‌వ‌తి అవ‌య‌వ‌దానం

VRO Mounika

VRO Mounika

బ్రెయిన్ డెడ్ అయిన యువ‌తి అవయవాలను దానం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. తాను చ‌నిపోతూ మ‌రో ఐదుగురికి పున‌ర్జ‌న్మ‌ను ఇచ్చింది. ఎచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బొడిగి మౌనిక.. శ్రీకాకుళం పట్టణంలోని రైతుబజార్ సమీపంలో ఉన్న సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. మౌనిక నాలుగు రోజుల క్రితం బైక్‌పై రోడ్డు క్రాస్ చేస్తుండ‌గా స్పీడ్ గా వ‌చ్చిన మ‌రో బైక్ ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె తలకు బ‌ల‌మైన గాయమైంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మౌనిక‌ ఆదివారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ (GEMS)లోని వైద్యుల ద్వారా సమాచారం అందుకున్న మౌనిక తల్లిదండ్రులు గుండె, కళ్ళు, మూత్రపిండాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకు మౌనిక అవయవాలను తరలించేందుకు ఆదివారం శ్రీకాకుళంలోని జెమ్స్ హాస్పిటల్ నుంచి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో కొద్ది గంటల వ్యవధిలోనే ఆమె అవయవాలను తరలించారు. మౌనిక గుండెను రోడ్డు మార్గం ద్వారా విశాఖప్నటం తరలించారు. అక్కడి నుంచి విమానంలో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఒక కిడ్నీని అదే హాస్పిటల్‌లోని ఓ రోగికి అమర్చగా.. మరో కిడ్నీని విశాఖలోని ఓ ప్రయివేట్ హస్పిటల్‌‌కు తరలించారు. రెండు కళ్లను రెడ్ క్రాస్‌కు అందించారు. విషయం తెలుసుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు మౌనిక తల్లిదండ్రులను అభినందించి వారికి కావాల్సిన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Also Read:  Death : ఒడిశాలోని హోటల్‌ గదిలో శ‌వ‌మైన మ‌హిళ‌.. అదృశ్య‌మైన భ‌ర్త‌