Chandrababu in Delhi: చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో `బొకే` ర‌చ్చ

చాలా కాలం త‌రువాత టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌కు టీడీపీ ఎంపీలు స్వాగ‌తం ప‌లికారు.

  • Written By:
  • Updated On - August 6, 2022 / 02:58 PM IST

చాలా కాలం త‌రువాత టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌కు టీడీపీ ఎంపీలు స్వాగ‌తం ప‌లికారు. ఆ సంద‌ర్భంగా ఎంపీలు బొకే ఇచ్చే స‌మ‌యంలో గ‌ల్లా జ‌య‌దేవ్‌, కేశినేని నాని మ‌ధ్య రెప్ప‌పాటు జ‌రిగిన స‌మ‌న్వ‌య‌లోపం చ‌ర్చ‌కు దారితీసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీల మ‌ధ్య ఉన్న గ్యాప్ ను ఆ సంఘ‌ట‌న ఎత్తిచూపుతోంది.

కేంద్ర ప్ర‌భుత్వ ఆహ్వానం మేర‌కు `ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వ‌` వేడుక‌ల్లో పాల్గొన‌డానికి చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో జ‌రిగే వేడుకులకు ఆయ‌న హాజ‌రు కానున్నారు. 2018 త‌రువాత మోడీ, చంద్ర‌బాబు ఒకే వేదిక‌పైకి రావ‌డం ఇదే ప్ర‌ధ‌మం. పైగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఆ వేడుకుల‌కు హాజ‌రవుతారు. ఆ వేడుక‌ల్లో మోడీ, చంద్ర‌బాబు, జ‌గ‌న్ క‌నిపించే దృశ్యాన్ని చూడాల‌ని చాలా మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి టైంలో టీడీపీ ఎంపీల మ‌ధ్య పొడ‌చూపిన స‌మ‌న్వ‌య‌లోపం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఆ సంఘ‌ట‌న‌పై టీడీపీ శ్రేణుల్లోనే విస్తృతంగా టాక్ న‌డుస్తోంది.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని చాలా కాలంగా టీడీపీ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయ‌న‌కు పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా అవ‌కాశం ల‌భించ‌క‌పోవ‌డంతో ఆనాటి నుంచి అస‌హ‌నంగా ఉంటున్నారు. పైగా విజ‌య‌వాడ కేంద్రంగా బుద్దా వెంక‌న్న‌, బొండా ఉమ లాంటి లీడ‌ర్ల‌ను లోకేష్ ప్రోత్స‌హిస్తున్నాడ‌ని అసంతృప్తి ఉంది. అందుకే, చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నిస్తూ ప‌రోక్షంగా కొన్నిసార్లు, ప్ర‌త్య‌క్షంగా మ‌రికొన్నిమార్లు ఆయ‌న విమ‌ర్శ‌లు చేసిన విష‌యం విదిత‌మే. విజ‌యవాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ మ‌ధ్య గ్యాప్ బ‌య‌ట‌ప‌డింది. ఆనాటి నుంచి చాలా అస‌హ‌నంగా టీడీపీ మీద కేశినేని నాని ఉన్నారు. రాజకీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌క‌టించారు. ఆయ‌న త‌మ్ముడు కేశినేని శివ‌నాథ్ రాజ‌కీయ తెర‌మీద‌కు ఇటీవ‌ల వ‌చ్చారు. ఉద్దేశ పూర్వ‌కంగా లోకేష్ ఆయ‌న్ను ప్రోత్స‌హిస్తున్నాడ‌ని నానికి అసంతృప్తి ఉంది.

ఇటీవ‌ల ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నేత‌ల‌తోనూ కేశినేని నాని మంత‌నాలు సాగిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. రాబోవు రోజుల్లో ఆయ‌న పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని టీడీపీలోని కొన్ని వ‌ర్గాలు భావిస్తున్నాయి. ప్ర‌స్తుతం లోక్ స‌భ‌లో ఉన్న ముగ్గురు టీడీపీ ఎంపీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం క‌నిపించ‌డంలేదు. ఆ కార‌ణంగా నాని ప‌క్క‌చూపులు చూస్తున్నార‌ని టాక్‌. వాళ్ల మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని మ‌రోసారి చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ సంద‌ర్భంగా బ‌య‌ట ప‌డింది. ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు గ‌ల్లా జ‌య‌దేవ్ ఇంటికి వెళ్లారు. ముగ్గురు ఎంపీలు, రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర, కంభంపాటి రామ్మోహ‌న్ రావు త‌దిత‌రులు ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లికారు. ఆ సంద‌ర్భంగా గ‌ల్లా జ‌య‌దేవ్ బొకేను చంద్ర‌బాబుకు ఇచ్చారు. క్ష‌ణాల్లో ఏమ‌నుకున్నాడో ఏమో అదే బొకేను కేశినేని నానికి అంద‌చేస్తూ చంద్ర‌బాబుకు ఇవ్వాల‌ని కోరారు. వెంట‌నే నాని ఆ బోకేను నిరాక‌రించిన దృశ్యం వీడియోల్లో కనిపిస్తోంది. దీంతో ఎంపీల మ‌ధ్య ఉన్న గ్యాప్ మ‌రోసారి పొలిటిక‌ల్ ర‌చ్చ‌కు దారితీసింది. యాదృశ్చికంగా జ‌రిగిన ఆ సంఘ‌ట‌న‌ను లైట్ గా తీసుకోవాల‌ని టీడీపీ కోరుతోంది.