Site icon HashtagU Telugu

Botsa Satyanarayana: 2024 వ‌ర‌కు ఏపీ రాజ‌ధాని హైద‌రాబాదే.. బొత్స కీల‌క వ్యాఖ్య‌లు..!

Botsa Satyanarayana Ap Three Capitals

Botsa Satyanarayana Ap Three Capitals

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని పై జ‌రుగుతున్న ర‌గ‌డ పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ స‌ర్కార్ అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా మాత్ర‌మే ప‌రిగ‌ణిస్తుంద‌ని బొత్స తేల్చి చెప్పారు. 2024 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమేనని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్దారు. ఇప్ప‌టికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని బొత్స మరోసారి స్పష్టం చేశారు.

ఇక జిల్లాల విభజనతో పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుదని చెప్పారు. శివరామకృష్ణ కమిటీ ప్రధాన సూచన వికేంద్రీకరణ అని బొత్స సత్యనారాయణ మరోసారి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. శాసనసభను చట్టాలను చేయొద్దంటే ఎలా కుదురుతుంద‌ని బొత్సా ప్ర‌శ్నించారు. రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థ అయినా పని చేయాల‌ని బొత్స తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం 2024 వరకు మన రాజధాని హైదరాబాదే అని.. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయని బొత్స పేర్కొన్నారు.

ఏ రాష్ట్ర‌మైనా రాజధానిని గుర్తించిన తర్వాత పార్లమెంట్‌కు పంపి అక్కడ ఆమోదం పొందిన తర్వాతే అది రాజ‌ధాని అని తెలుస్తుందని బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ఇప్పుడు అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవ‌ని, వైసీపీ ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే అని బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని విషయంలో కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలా వద్దా అనేది బీఏసీలో నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు. చ‌ట్టాలు చేయ‌డానికే శాసనసభలు, పార్లమెంటులు ఉన్నాయ‌ని, చట్టాలు చేసే అధికారం చట్టసభలకు లేదని కోర్టు చెప్పలేదని అన్నారు. కోర్టు కేవలం సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేసే అంశంపైనే వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు.

ఇక శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రధాన సూచన ప్రకారమే తాము రాజధానుల వికేంద్రీకరణ చేపట్టామని బొత్స అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక విధానం అంటూ ఏమీ లేదని బొత్స సత్యనారాయణ మండి పడ్డారు. తొలుత సభకు రానని చెప్పిన టీడీపీ తర్వాత వ‌చ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుందని, సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు చెప్పారు. టీడీపీ నేతలకు ఆవేశం ఎక్కువని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎప్పుడు ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు. దూర దృష్టితో తీసుకునే నిర్ణయాలను మాత్రమే ప్రజలు ఆమోదిస్తార‌ని టీడీపీ నేతలపై బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మ‌రి బొత్స వ్యాఖ్య‌ల‌పై టీడీపీ బ్ర‌ద‌ర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.