YSRCP: వై.ఎస్.జగన్ వైసీపీ పార్టీకి మైనస్‌గా మారుతున్నారా.! ఆయన వైఖరి వల్ల ప్రజల్లో ఆ పార్టీపై మరింత వ్యతిరేకత పెరుగుతోందా! అంటే అవుననే సమాధానమే వస్తోంది. జగన్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీని మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. జగన్ నిర్ణయాలను ఆ పార్టీ నేతలు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఐతే ఈ విషయాన్ని వారెక్కడ బహిరంగంగా చెప్పకపోయిన, సన్నిహితుల దగ్గర ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. చట్టసభల విషయంలోనూ జగన్ వైఖరిని పార్టీ నేతలే ఎక్స్‌పోజ్ చేస్తున్నారు.
శాసనమండలిలో బొత్స సత్యనారాయణ తనకు సరైన వాగ్దాటి లేనప్పటికీ..ఇతరులకు అవకాశం ఇవ్వడం, నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జనాల్లో చర్చ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా కూటమి సర్కార్ నుంచి సమాధానం రాబట్టేలా కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో శాసనసభకు సైతం జగన్ హాజరై ఇదే మాదిరిగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చు కదా అన్న చర్చ జరుగుతోంది. కానీ జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే సభకు వస్తానంటూ మంకు పట్టుపట్టి కూర్చున్నారు.
మండలిలో వైసీపీ సభ్యుల పోరాటం
నిజానికి జగన్ అసెంబ్లీకి రాకపోవడంతో అక్కడ అంతా ఏకపక్షంగానే జరుగుతుంది. కానీ మండలిలో మాత్రం వైసీపీ సభ్యులు పోరాటం చేస్తున్నారు. వైసీపీ తరపున నలుగురైదుగురు ఎమ్మెల్సీలు మాట్లాడేందుకు ముందుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ వారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వాన్ని హామీలపై, పథకాల విషయంలో ప్రశ్నిస్తున్నారు. కొన్ని అంశాల్లో ప్రజల్లో అపోహలు సృష్టించేలా చేయగలుగుతున్నారు. టీడీపీ సభ్యులు సమాధానం ఇస్తున్నప్పటికీ..వైసీపీ ఆ టాపిక్స్‌ను హైలెట్ చేస్తోంది.
నిజానికి శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే మరింత హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై ప్రశ్నించవచ్చు. అసెంబ్లీ ప్రశ్నించాలంటే ప్రత్యేకంగా ప్రతిపక్షహోదా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతిపక్ష నేత కాదు అని ఎవరూ చెప్పడం లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడే. అయితే అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమే. ప్రభుత్వ వ్యతిరేక పార్టీ ఏదైనా కాబట్టి ప్రతి పక్షమే. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా మాత్రం గుర్తించరు. ఆ గుర్తింపు లేనంత మాత్రాన మాట్లాడే సమయంలో కోత పడదు. మాట్లాడే చాన్స్ ఇస్తారు. ఐనప్పటికీ జగన్ సభకు హాజరు కావడం లేదు.
రాజకీయాలలో ఎంతటి కష్టం ఎదురైనా ముందుకు వెళ్లినవాడే సక్సెస్ అవుతాడు. వెన్ను చూపినవాడు పిరికివాడుగా మిగిలిపోతాడు. ఇప్పుడు జగన్ వైఖరి అలానే ఉంది. అలా ఉంటే రాజకీయాలలో సుదీర్ఘ కాలం కొనసాగడం అసాధ్యం. ఇక కేవలం అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఒక్క రోజు వెళ్లి రావడం జగన్ మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి రాజకీయాలు జగన్‌ను ప్రజల్లో మరింత చులకన చేస్తాయి. బొత్స లాంటి సీనియర్ల సలహా తీసుకునైనా జగన్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.