ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. తాజా సంఘటనలో తిరుపతిలోని ఎస్‌వీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు మెయిల్ ద్వారా హెచ్చరిక పంపారు. విశ్వవిద్యాలయం సమీపంలో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఐదు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు ఆగంతకులు పేర్కొనడంతో భయాందోళన నెలకొంది. ఈ సమాచారంతో పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు.
Japan PM : జపాన్ ప్రధానిగా ‘ఐరన్ లేడీ’..!
సూచన అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్ , స్థానిక పోలీసులు పెద్దఎత్తున తనిఖీలు ప్రారంభించారు. హెలిప్యాడ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఖాళీ చేయించి, విశ్వవిద్యాలయం పరిసరాల్లో కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. రోడ్లపై వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, ప్రతి మూలన సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే సమాచారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంతలో ఈమెయిల్ పంపిన వ్యక్తుల వివరాలను గుర్తించడానికి సైబర్ నేరాల విభాగం కూడా పరిశోధన ప్రారంభించింది.
ఈ ఘటనతో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఆందోళన వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాకను దృష్టిలో ఉంచుకొని హెలిప్యాడ్ వద్ద కఠిన భద్రత ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నప్పటికీ, ఇలాంటి బెదిరింపులు అదనపు జాగ్రత్తలు తీసుకునేలా చేశాయి. ఇటీవల దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థలపై ఇలాంటి అసత్య బాంబు బెదిరింపులు పెరుగుతుండటంతో అధికారులు ప్రజలను ఆందోళన చెందవద్దని, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సంఘటన నిజమా, కేవలం భయపెట్టడానికేనా అన్నది పోలీసులు త్వరలోనే స్పష్టం చేయనున్నారు.
