BJP, TDP Alliance : చంద్ర‌బాబుతో బీజేపీ?టార్గెట్ కేసీఆర్‌! గుజ‌రాత్ ఫ‌లితాల జోష్‌!

గుజ‌రాత్ ఫ‌లితాలు(Gujarat result) బీజేపీకి అనుకూలంగా రావ‌డం టీడీపీ జాతీయ అధినేత చంద్ర‌బాబుకు ఊర‌ట క‌లిగిస్తుందా?

  • Written By:
  • Updated On - December 8, 2022 / 05:25 PM IST

గుజ‌రాత్ ఫ‌లితాలు(Gujarat result) బీజేపీకి అనుకూలంగా రావ‌డం టీడీపీ జాతీయ అధినేత చంద్ర‌బాబుకు ఊర‌ట క‌లిగిస్తుందా? ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో పొత్తు(alliance)ల‌ను మార్చేయ‌బోతుందా? ఇటీవ‌ల జ‌రిగిన మోడీ, చంద్ర‌బాబు భేటీలు ఫ‌లించేలా ఉన్నాయా? ఏపీలో కింగ్ మేక‌ర్, తెలంగాణ‌లో కింగ్ కావాలంటే `పుష్పా`నికి టీడీపీ మ‌ద్ధ‌తు అవ‌స‌ర‌మా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షా ద్వ‌యం వేసిన పాచిక‌లు గుజ‌రాత్ లో రికార్డ్ ను సృష్టించాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణ మీద వాళ్ల క‌న్నుంది. ఇప్ప‌టికే స‌ర్వేల‌ను చేయించుకున్న బీజేపీ ఎలాగైనా కేసీఆర్ ను గ‌ద్దె దించాల‌ని భీష్మించారు. ఆ క్ర‌మంలో చంద్ర‌బాబు మ‌ద్ధ‌తు అనివార్య‌మ‌ని క్షేత్ర‌స్థాయి స‌ర్వేల్లోని సారాంశ‌మ‌ట‌. ఎందుకంటే, 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ కూట‌మి 19 మంది ఎమ్మెల్యేల‌ను తెలంగాణ‌లో గెలుచుకుంది. ఆ రెండు పార్టీల మ‌ధ్య కెమిస్ట్రీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేసింది. పాత జ్ఞాప‌కాలు, ఫ‌లితాల‌ను బేరీజు వేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వ‌ర‌కు టీడీపీతో పొత్తు(alliance) కోసం బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో కమ్యూనిస్ట్ ల‌తో చేయి క‌లిపిన కేసీఆర్ 2023 ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ తో కూట‌మి క‌ట్టే అవ‌కాశం లేక‌పోలేదు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే ప్ర‌శాంత్ కిషోర్ సూచ‌న కూడా చేశారు. మ‌రో వైపు ఎంఐఎం స‌హ‌జ మిత్రునిగా కేసీఆర్ కు అండ‌గా నిలుస్తోంది. అంటే, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, క‌మ్యూనిస్టుల కూట‌మి 2023 ఎన్నిక‌ల తెర‌పై క‌నిపించ‌నున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని భావ‌న‌. ఇలా త‌యారు కానున్న కేసీఆర్ కూట‌మిని ఢీ కొట్టాలంటే చంద్ర‌బాబు మ‌ద్ధ‌తు బీజేపీకి అవ‌స‌రం. 2023 ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఎత్తుగ‌డ‌ల‌ను చీల్చి చెండాడాలంటే చంద్ర‌బాబుఅండ అవ‌స‌ర‌మ‌ని అమిత్ షా ఇప్ప‌టికే ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఏపీలో గ‌త మూడేళ్లుగా జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాయి. కానీ, ఎక్క‌డా డిపాజిట్లు ద‌క్క‌లేదు. ఆ పార్టీని ఏపీ ప్ర‌జ‌లు ఆద‌రించే ప‌రిస్థితి కూడా లేదు. రాష్ట్ర ప్ర‌యోజనాల‌ను కాల‌రాసిన పార్టీగా కాంగ్రెస్ ను దాదాపుగా ఏపీ ప్ర‌జ‌లు బాయ్ కాట్ చేశారు. విభ‌జ‌న త‌రువాత కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేసింద‌ని ఏపీ ఓట‌ర్లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఆ క్ర‌మంలో ఎంతో కొంత ప్ర‌జాద‌ర‌ణను పొందాలంటే చంద్ర‌బాబుతో క‌లిసి వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని బీజేపీ అగ్ర‌నేత‌ల భావ‌న‌. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని రెండుసార్లు ఇటీవ‌ల చంద్ర‌బాబు క‌లిశారు. వాళ్లిద్ద‌రూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. రాబోవు రోజుల్లో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. టీడీపీతో క‌లిసి వెళ్ల‌డానికి అమిత్ సా సానుకూలంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మోడీ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే జ‌నసేన‌, బీజేపీ, టీడీపీ కూట‌మి 2014 త‌ర‌హాలో 2024 ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నుంది. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు ఇటీవ‌ల జ‌రిగిన ఏలూరు స‌భ‌లో ప‌రోక్షంగా వెల్ల‌డించారు.

వాస్త‌వంగా తెలుగు రాష్ట్రాల్లో మోడీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను కేసీఆర్ కూడ‌గ‌డుతున్నారు. మూడోసారి సీఎం కావ‌డానికి కూట‌మి త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారు. అందుకే, మునుగోడు నుంచి ఆయ‌న పావులు క‌దిపారు. అక్క‌డ కామ్రేడ్లను క‌లుపుని భ‌విష్య‌త్ ఈక్వేష‌న్ కు సంకేతాలు ఇచ్చారు. గుజ‌రాత్ ఫ‌లితాలు బీజేపీకి అనుకూలంగా రావ‌డంతో జ‌రిగే రాజ‌కీయ దాడిని ఎదుర్కోవ‌డానికి కేసీఆర్‌ గ్రౌండ్ వ‌ర్క్ ఇప్ప‌టికే చేస్తున్నారు. టీడీపీతో పొత్తు వ్య‌వ‌హారం ఒక కొలిక్కి వ‌స్తే, దాదాపుగా గులాబీ పార్టీ ఖాళీ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పూర్వ‌పు టీడీపీ లీడ‌ర్ల‌తో నిండిపోయిన కారును వాళ్లంద‌రూ రాబోవు రోజుల్లో దిగుతార‌ని భావిస్తున్నారు. అంతేకాదు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో వెళ్లిన టీడీపీ లీడ‌ర్లు, శ్రేణులు బీజేపీ లేదా టీడీపీలోకి తిరిగి వ‌స్తార‌ని అంచ‌నా. ఇలాంటి ఈక్వేష‌న్ల న‌డుమ బీజేపీ, టీడీపీ పొత్తు దాదాపుగా ఖ‌రారు కానుంద‌ని గుజ‌రాత్ ఫ‌లితాల ద్వారా అర్థం అవుతోంది.

ఇచ్చిపుచ్చుకునేలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల దృష్ట్యా బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందని రాజ‌కీయ స‌ర్కిల్స్ లోని టాక్‌. ద‌క్షిణ భార‌త దేశంలో కర్ణాట‌క మినహా ఎక్క‌డ బీజేపీ ప్రాబ‌ల్యం లేదు. ఈసారి అక్క‌డ బీజేపీని గ‌ద్దె దించ‌డానికి కేసీఆర్ ఇప్ప‌టి నుంచే జేడీఎస్ ద్వారా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంగ‌బ‌లం, అర్థ‌బ‌లాన్ని క‌ర్ణాట‌క‌లో ఆ పార్టీకి ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఏపీలోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి 2019 ఎన్నిక‌ల మాదిరిగా స‌హాయ‌, స‌హ‌కారాలు అందించ‌నున్నారు. ఇలాంటి పరిస్థితుల న‌డుమ చంద్ర‌బాబుతో చేతులు క‌లిపితే క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రంలోనూ ఎంతో కొంత బీజేపీకి లాభం జ‌రుగుతుంద‌ని ఢిల్లీ బీజేపీ అగ్ర‌నేత‌ల అంచ‌నా. ఆ విష‌యాన్ని తెలియ‌చేస్తూ ఆర్ ఎస్ఎస్ కూడా ఇటీవ‌ల ఒక నివేదిక‌ను ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయం కానుంద‌ని గుజ‌రాత్ ఫ‌లితాల(.Gujarat result) ద్వారా అర్థం అవుతోంది.