Site icon HashtagU Telugu

Political Alliance: టీడీపీ, బీజేపీ ‘పొత్తు’ భారతం

Jagan-CBN

Babu And Jagan

“ధుర్యోధనుడికి కృష్ణుడు సమయం ఇచ్చారని,కానీ, చేతులు మాత్రం కలపలేదు’ అంటూ బీజేపీ, టీడీపీ పొత్తుపై బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉదహరించిన దుర్యోధనుడు ఎవరు? అనేది ఇప్పుడు రేకెత్తుతున్న ప్రశ్న. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు గురించి అన్నారా? లేక ప్రస్తుతం ఏపీ సిఎంగా ఉన్న జగన్ వాలకాన్ని ఉదహరించారా? అనే చర్చ నడుస్తోంది.
మాజీ మిత్రులు టీడీపీ, బీజేపీ పొత్తు పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. పొత్తు ఉంటుందా?ఉండదా? అనే దాని పైన అధికారికంగా టీడీపీ నుంచి క్లారిటీ లేదు. ఏపీతో సంబంధం ఉన్న బీజేపీ జాతీయ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాయి. ఆజాదీ కా మహోత్సవ్ కు సంబంధించి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత బాబు కలిసినప్పటి నుంచి ఊహాగానాలకు అంతులేకుండా పోయింది.
ప్రస్తుతం వైసీపీ ,బీజేపీ జాతీయ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. మునుగోడులో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ ,బీజేపీ పొత్తు న్యూస్ కు హద్దు లేకుండా పోయింది. ఈ పొత్తు అంశం పైన ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ తాజాగా కొత్త విశ్లేషణ చేసారు. సీఎం హోదాలో జగన్ ,ప్రధానిగా ఉన్న మోదీని పలుమార్లు కలిసారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో
ఆజాదీ కా మహోత్సవ్ పైన జరిగిన భేటీలో ప్రధాని మోదీ, అక్కడ చంద్రబాబుతో పాటుగా ఫరూక్ అబ్దుల్లాను కలిసిన అంశాన్ని దేవధర్ గుర్తు చేసారు. దీంతో దేవధర్ ఎవరిని ధుర్యోధనుడిగా పేర్కొంటున్నారనేది మరో చర్చకు కారణమైంది. దీనికి కొనసాగింపుగా ఆయన ఢిల్లీ మీడియతో కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని చెప్పారు. పొత్తుల అంశం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని, ఎవరో సంపాదకీయాల్లో రాసినంత మాత్రాన జరగదని వ్యాఖ్యానించారు. ఏపీలో ఏ పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదని దేవధర్ స్పష్టం చేయడం గమనార్హం.
జనసేన ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా, రెండు పార్టీల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు వార్తలను ఖండిస్తున్నా, టీడీపీ నుంచి మాత్రం స్పందన లేదు. రాష్ట్రపతి – ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతుగా నిలిచాయి. వచ్చే ఎన్నికల నాటికి కేంద్రం నుంచి జగన్ కు మద్దతు లేకుండా చూడాలనేది టీడీపీ వ్యూహం. అదే సమయంలో వైసీపీ అధినాయకత్వం జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంది. కేంద్రంతో సత్సంబంధాలు ఎన్నికల ముందు మరింత అవసరమని భావిస్తోంది. దీంతో టీడీపీ వేస్తున్న అడుగులకు అనుగుణంగా వ్యవహరించాలని యోచిస్తోంది.
బీజేపీ తో పొత్తు వ్యవహారం ఏపీలో రాజకీయాల్లో ప్రతి రోజు ఆసక్తి కరంగా మారింది. తాజాగా సునీల్ చేసిన కామెంట్స్ లోని ఆంతర్యాన్ని మీడియా తరచి చూస్తోంది.

Exit mobile version