ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ప్రచారం చేశారు. అయితే ముందస్తు ఛాన్సే లేదని అధికార వైసీపీ పార్టీ నాయకులు తేల్చేశారు. ఇక ఆ విషయం పక్కన పెడి పెడితే ఇటీవల జనపేన ఆవిర్భావ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ పొత్తు రాజకీయాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వనని, అవసరమైతే ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటానని, ముఖ్యంగా టీడీపీతో కలిసేందుకు సిద్ధమే అని పవన్ హింట్ ఇచ్చాడు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలకు ముందుకు బీజేపీకి టీడీపీకి మధ్య ఉన్న పొత్తు బ్రేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీతో కలిసే ఛాన్సే లేదని ఇప్పటికే బీజేపీ నేతలు అనేకసార్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో కాపురం చేస్తున్నా, మనసంతా మాత్రం టీడీపీతోనే ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందని తెలుస్తోంది. అదేంటంటే.. జనసేన నుండి పవన్ సీఎం అభ్యర్థిగా ఉండడానికి ఒప్పుకుంటే, టీడీపీతో కలవడానికి సిద్ధమేనంటూ ఏపీ బీజేపీ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.
ఇప్పటికే తెరవెనుకాల టీడీపీ కనుసన్నల్లోనే బీజేపీ, జనసేన పార్టీలు పని చేస్తున్నాయన్న విమర్శలు వైసీపీ నుంచి దూసుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తెలివిగా బంతిని టీడీపీ కోర్టులోకి నెట్టేసింది. దీంతో ఇప్పుడు తేల్చుకోవాల్సింది టీడీపీనే. 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనీ, విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి వైసీపీని ఎదుర్కోవాలని ఇటీవల పార్టీ ఆవిర్భావ సభలో జనసేనాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దానర్థం జనసేన, టీడీపీతో కలవడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
ఈ నేపధ్యంలో ఎలాగూ టీడీపీతో కలిసేందుకు పవన్ సిద్ధంగా ఉన్న క్రమంలో, తెలివిగా కొత్త ప్రతిపాదనని తెరపైకి తెచ్చి పవన్‌ను ఇరకాటంలో పెట్టింది బీజేపీ. దీంతో ఇప్పుడు చంద్రబాబు, బీజేపీ-జనసేన కూటమికి అంగీకారం తెలపాలంటే, తాను ముఖ్యమంత్రి రేసులోంచి తప్పుకోవాలి. అయితే చంద్రబాబు అలా కలలో కూడా చేయడని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పవన్ దూకుడుకు స్మార్ట్‌గా పుల్‌స్టాప్ పెట్టింది బీజేపీ. బీజేపీ ప్రతిపాదన టెంప్టింగ్‌గానే ఉన్నా చంద్రబాబుతో ఈ విషయంపై ఎలా చర్చించాలో అర్ధం కావడంలేదట. దీంతో బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్‌తో పవన్ కళ్యాణ్ అయోమయంలో పడ్డారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.