BJP Party: బీజేపీకి కొత్త అధ్యక్షులు.. తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరి!

బీజేపీ నాయకత్వం అధ్యక్షులను మార్పు చేస్తూ పార్టీ ప్రక్షాళనకు దిగింది. తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీ పురందేశ్వరిలను నియమించింది.

  • Written By:
  • Updated On - July 4, 2023 / 03:51 PM IST

ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు, మరోవైపు లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నాయకత్వం పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్పు చేస్తూ పార్టీ ప్రక్షాళనకు దిగింది. ఈ క్రమంలో తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరిలను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌, షెకావత్‌తో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, గుజరాత్, పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులను మార్చేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న అధ్యక్షులను మార్పుచేసి, కొత్తవారిని నియమిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే, ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తున్నట్లు జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. 2020 జులై 27న ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియామకం అయ్యారు. అయితే, సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరిని నియమించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురిగా, బీజేపీ నాయకురాలిగా పురందేశ్వరికి మంచి పేరుంది.

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుకూడా ఖాయమని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి అధ్యక్ష బాధ్యతలు పార్టీలోని సీనియర్ నేతలకు అప్పగించాలని బీజేపీ కేంద్ర అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో ఎంతో కాలంగా పనిచేస్తున్న కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించింది బీజేపీ హైకమాండ్. బీజేపీ బలోపేతానికి కిషన్ రెడ్డి ఎంతో కాలంగా పనిచేసినందున మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించింది అధినాయకత్వం. బండి సంజయ్ 2020 మార్చి 11న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా నియామకమైన విషయం తెలిసిందే.