BJP Vs TDP : క‌మ‌లవ్యూహంలో 40 ఏళ్ల టీడీపీ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు రాజ‌కీయ అప‌ర చాణ‌క్యుడు. మ‌ళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తాడ‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ విశ్వ‌సిస్తోంది. ఏపీ పున‌ర్నిర్మాణం కోసం అధికారంలోకి రావాలంటూ చంద్ర‌బాబు తాజాగా ఇస్తోన్న స్లోగ‌న్‌.

  • Written By:
  • Publish Date - March 29, 2022 / 03:58 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు రాజ‌కీయ అప‌ర చాణ‌క్యుడు. మ‌ళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తాడ‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ విశ్వ‌సిస్తోంది. ఏపీ పున‌ర్నిర్మాణం కోసం అధికారంలోకి రావాలంటూ చంద్ర‌బాబు తాజాగా ఇస్తోన్న స్లోగ‌న్‌. టీడీపీ 40ఏళ్ల ప్ర‌స్తానం గురించి యువ‌త‌కు తెలియ‌చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని తెలుగుజాతి నుంచి విడ‌దీయ‌లేర‌నే స‌త్యాన్ని చెబుతున్నాడు. కానీ, తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి ఎలాంటి స్లోగ‌న్ అందుకోలేదు.ఇక ఏపీలో అధికారంలోకి రావ‌డానికి వేస్తోన్న ఎత్తుగ‌డ‌ల‌కు బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు బ్రేక్ వేశాడు. సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ కల్యాణ్ కు జై కొడితేనే పొత్తు అంటున్నాడు. రాజ్యాధికారం దిశ‌గా అడుగులు వేస్తున్నానంటూ ప‌వ‌న్ కూడా చెబుతున్నాడు. ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ప‌వ‌న్ శ‌ప‌థం చేసిన విష‌యం విదిత‌మే. ఇటీవ‌ల జ‌రిగిన జ‌న‌సేన ఆవిర్భావం వేడుక త‌రువాత పొత్తుల‌పై ఏపీలో ర‌చ్చ జ‌రుగుతోంది. బీజేపీ రోడ్ మ్యాప్ ప్ర‌కారం న‌డుచుకుంటానంటూ జ‌న‌సేనాని చెప్పేశాడు. ఆ రోడ్ మ్యాప్ ఏమిటో సోము వీర్రాజు ఒక మాట‌లో తేల్చేశాడు. సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ ఉంటేనే టీడీపీతో పొత్తు అంటూ బాబుపై అస్త్రాన్ని సంధించాడు.

జ‌న‌సేన పార్టీకి 21శాతం పైగా ఓటు బ్యాంకు ఉంద‌ని ప‌వ‌న్ అంచ‌నా వేస్తున్నాడు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓటు బ్యాంకును ప్రామాణికంగా తీసుకుంటున్నాడు. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దూరంగా ఉంది. కుప్పంలాంటి కొన్ని చోట్ల మాత్ర‌మే పోటీ చేసింది. ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, మున్సిప‌ల్‌, కార్పొరేషన్ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నాడు. దీంతో ఆ పార్టీ క్యాడ‌ర్ క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన వైపు మొగ్గింది. కొన్ని చోట్ల టీడీపీ లీడ‌ర్లే జ‌న‌సేన అభ్య‌ర్థులుగా పోటీ చేశారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో రెండు పార్టీలు క‌లిసి పోటీలోకి దిగిన విష‌యం విదిత‌మే. ఆ విష‌యాల‌ను పక్క‌న‌పెట్టిన ప‌న‌న్ త‌న పార్టీకి 21శాతం పైగా ఓటు బ్యాంకు ఉంద‌ని లెక్కిస్తున్నాడు. మిత్రునిగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకును కూడా క‌లుపుకుంటే 30శాతం వ‌ర‌కు అంచ‌నా వేస్తున్నాడు. అందుకే, ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ అంటూ వీర్రాజు స్లోగ‌న్ అందుకున్నాడు.2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. ఆ త‌రువాత కూట‌మి విడిపోవ‌డంతో మూడు పార్టీలు దాదాపుగా ఏపీలో లేకుండా పోయాయి. బ‌ల‌మైన టీడీపీ కూడా 23 ఎమ్మెల్యేల‌కు పరిమితం అయింది. ఇప్పుడు మ‌ళ్లీ కూట‌మి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ బీజేపీ మాత్రం చంద్ర‌బాబుతో జ‌త క‌ట్టేందుకు సిద్ధంగా లేదు. ఆ విష‌యాన్ని స్వ‌యాన అమిత్ షా ఏపీ లీడ‌ర్లుకు చెప్పాడ‌ని తెలుస్తోంది. అందుకే, బీజేపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ పేరును ప్ర‌క‌టించారు. ఇప్పుడు ప‌వ‌న్ సీఎం అభ్య‌ర్థిత్వానికి బాబు మ‌ద్ధ‌తు ఇస్తాడా? లేక మ‌రో కూట‌మి దిశ‌గా అడుగులు వేస్తాడా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఒక వేళ సాహ‌సం చేసి బీజేపీతో క‌టీఫ్ చేసుకుని జ‌న‌సేన బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పటికీ ఇద్ద‌రి మ‌ధ్యా భాగ‌స్వామ్యం కుద‌ర‌డం అంత ఈజీ కాదు. పైగా సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన త‌రువాత ప‌వ‌న్ కూడా టీడీపీ వైపు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు.

వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్‌, టీడీపీ కూట‌మిగా వెళ్లిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఫ‌లితాలు ఉంటాయ‌న్న గ్యారెంటీ లేదు. అలాంటి ప‌రిస్థితుల్లో సీఎంగా ప‌వ‌న్ కు మ‌ద్ధ‌తు ఇవ్వాల్సిన అనివార్య ప‌రిస్థితి ఏర్ప‌డే ఛాన్స్ లేక‌పోలేదు. ఎన్నిక‌ల త‌రువాత పొత్తుపై బీజేపీ ఆలోచిస్తోంద‌ట‌. ఒక వేళ ముందుగా పొత్తు కావాలంటే ప‌వ‌న్ ను సీఎం అభ్య‌ర్థిగా అంగీక‌రించాల‌ని కండీష‌న్ పెడుతోంది. ఆ క్ర‌మంలో 40 ఏళ్ల టీడీపీ పండుగ చేసుకుంటోన్న 70 ప్ల‌స్ చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది అంతుబట్ట‌ని వ్యూహం. 40 వ‌సంతాల టీడీపీ తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా వ‌దిలేసుకుంది. ఇక మిగిలిన ఏపీ రాష్ట్రంలో ఎదురీదుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ అండతో అధికారంలోకి వ‌స్తుందా? లేక జ‌నసేనాని ప‌వ‌న్ గ‌ద్దె ఎక్క‌డానికి స‌హ‌కారం అందిస్తుందా? అనేది చూడాలి.!