Kingmaker BJP : చంద్రుల‌కు ఇక చుక్క‌లే.?

తెలంగాణ‌లో కింగ్‌, ఏపీలో కింగ్ మేక‌ర్ కావ‌డానికి బీజేపీ చాలా కాలంగా ఎత్తుగ‌డ‌లు వేస్తోంది.

  • Written By:
  • Publish Date - March 11, 2022 / 04:17 PM IST

తెలంగాణ‌లో కింగ్‌, ఏపీలో కింగ్ మేక‌ర్ కావ‌డానికి బీజేపీ చాలా కాలంగా ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. భారీ ల‌క్ష్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎలా చేరుకోగ‌ల‌దు? టీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీనా? అంటే కాంగ్రెస్ ముక్త్ భార‌త్ నినాదాన్ని బేస్ చేసుకుంటే..కాంగ్రెస్ పార్టీని తొలుత‌ క్లోజ్ చేయ‌డానికి ఎత్తుగ‌డ‌లు వేసే ఛాన్స్ ఉంది. అదే స‌మ‌యంలో టీఆర్ఎస్ ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి వ్యూహాల‌ను ర‌చిస్తుంది. ఇక ఏపీలో కింగ్ లేదా కింగ్ మేక‌ర్‌ కావాలంటే వైసీపీని క్లోజ్ చేయాలా? టీడీపీని క్లోజ్ చేయాలా? అనే ప్ర‌శ్న బీజేపీ ముందుంది.బీజేపీకి స‌హ‌జ మిత్రునిగా వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట కూడా చాలా అంశాల్లో స‌హ‌కారం అందిస్తోంది. ఒకానొక స‌మ‌యంలో ఎన్టీయేలో భాగ‌స్వామిగా అవుతుంద‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, రాష్ట్రంలోని పొలిటిక‌ల్ ఈక్వేష‌న్ కార‌ణంగా స‌హ‌జ మిత్రునిగా ఉండ‌డానికే వైసీపీ ఇష్ట‌ప‌డింద‌ట‌. కేంద్రానికి చెప్ప‌కుండా ఏమీ చేయ‌మ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఏర్ప‌డిన తొలి రోజుల్లోనే ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్పాడు. మోడీ, అమిత్ షా తో చ‌ర్చించిన త‌రువాత మాత్ర‌మే ఏదైనా నిర్ణ‌యం ఉంటుంద‌ని బాహాటంగానే వివ‌రించాడు. ఆ క్ర‌మంలో టీడీపీని బ‌ల‌హీన ప‌ర‌చ‌డ‌మే బీజేపీ ముందున్న అవ‌కాశం.

ఇప్ప‌టికే రాజ్య‌స‌భ‌లో టీడీపీని బీజేపీ విలీనం చేసుకుంది. రాజ్యాంగం ప్ర‌కారం టీడీపీని విలీనం చేస్తూ చైర్మన్ హోదాలో వెంక‌య్య‌నాయుడు నిర్ణ‌యం తీసుకున్నాడు. రెండున్న‌రేళ్ల క్రితమే రాజ్య‌స‌భ కేంద్రంగా టీడీపీని క్లోజ్ చేసిన వైనాన్ని చూశాం. ఇక ఇప్పుడు అసెంబ్లీ వేదిక‌గా ఎలా క్లోజ్ చేయాలో బీజేపీ ఆలోచిస్తుంద‌ట‌. ప్ర‌స్తుతం 23 మంది ఎమ్మెల్యేలు టీడీపికి ఉన్నారు. వాళ్ల‌లో న‌లుగురు రెబ‌ల్స్ గా ఉన్నారు. మిగిలిన 19 మందిలో క‌నీసం 12 మంది బీజేపీకి ట‌చ్ లో ఉన్నార‌ని క‌మ‌ల‌ద‌ళం చెబుతోంది. అయితే, ప్ర‌స్తుత అసెంబ్లీలో బీజేపీ ప్రాతినిధ్యం లేదు. కేవ‌లం మండ‌లిలో మాత్ర‌మే ఉంది. కనీసం 6 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళితే అసెంబ్లీలో ప్రాతినిధ్యంతో పాటు రాజ్యాంగం ప్ర‌కారం విలీనం ఖారారు అవుతుంది.ఇక నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చ‌రిష్మా ఉన్న టీడీపీ లీడ‌ర్ల‌ను బీజేపీ గుర్తిస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్ తో పాటు న‌డిచిన గ్రాండ్ ఓల్డ్ లీడ‌ర్లు కాకుండా ప్ర‌జాద‌ర‌ణ ఉన్న లీడ‌ర్ల కోసం అన్వేషిస్తోంద‌ని తెలుస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన లీడ‌ర్ల‌పై వ‌ల వేసేందుకు బీజేపీ స్కెచ్ వేసింద‌ని స‌మాచారం. ఆ ఆప‌రేష‌న్ ప్ర‌క్రియ‌ను టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఒక కీల‌క లీడ‌ర్‌కు అప్ప‌గించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి స‌మాంత‌రంగా వైసీపీ నుంచి వ‌చ్చే లీడ‌ర్ల‌ను కూడా ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ట‌. ఇప్ప‌టికే జ‌గ‌న్ వాల‌కం న‌చ్చ‌క సుమారు 45 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నార‌ని బీజేపీ అంచ‌నా. వాళ్ల‌లో ప్ర‌జాద‌ర‌ణ ఉన్న ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని వినికిడి. వాళ్ల‌ను టీడీపీ వైపు వెళ్ల‌కుండా బీజేపీలోకి లాక్కునే మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌ట‌.

తెలంగాణ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని చాలా కాలంగా బీజేపీ చెబుతోన్న మాట‌. ఎమ్మెల్యేలు, ఎంపీలు ట‌చ్ లో ఉన్నార‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ ప‌లు మార్లు చెప్పాడు. పైగా కేసీఆర్ ను జైలుకు పంపిస్తామ‌ని దుబ్బాక ఎన్నిక‌ల నుంచి చెబుతున్నాడు. ఇప్ప‌టికే క‌ల్వ‌కుంట్ల కుటుంబంపై ఈడీ విచార‌ణ మొద‌లయ్యింద‌ని బీజేపీ ఊద‌ర‌గొడుతోంది. ట‌చ్ చూస్తే, కేసీఆర్ ప‌వ‌ర్ ఏంటో తెలుస్తుంద‌ని గులాబీ ద‌ళం స‌వాల్ చేస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గ‌మంటోంది. దానికితోడు ఇటీవ‌ల మోడీ ని వ్య‌క్తిగ‌తంగా కేసీఆర్ టార్గెట్ చేశాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ పై విచార‌ణ‌కు ఆదేశించాలా? టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేల‌ను , లీడ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డం ద్వారా బల‌హీన ప‌ర‌చాలా? అనే దానిపై బీజేపీ యోచిస్తుంద‌ట‌. ముందుగా కాంగ్రెస్ పార్టీలోని కీల‌క లీడ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తే..ఆ త‌రువాత కేసీఆర్ సంగ‌తి చూడొచ్చ‌నే ఆలోచ‌న కూడా బీజేపీ చేస్తుంద‌ని టాక్‌. మొత్తం మీద కాంగ్రెస్ ముక్త్ భార‌త్ దిశ‌గా దూకుడుగా వెళుతోన్న బీజేపీ త్వ‌ర‌లోనే కేసీఆర్‌, చంద్ర‌బాబు మీద రాజ‌కీయ దండ‌యాత్ర చేయనుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. అది ఎలా ఉంటుందో..చూడాలి.