Site icon HashtagU Telugu

Amaravathi : అమ‌రావ‌తికి ఏపీ బీజేపీ అండ‌..21న రైతుల‌తో నేత‌ల పాద‌యాత్ర

న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం మ‌హాపాద‌యాత్ర‌కు అమిత్ షా ఊపునిచ్చాడు. ఆయ‌న ఆదేశాల మేర‌కు మ‌హా పాద‌యాత్ర‌కు మ‌ద్ధ‌తుగా ఈనెల 21న బీజేపీ నేత‌లు న‌డ‌వ‌బోతున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తోన్న యాత్ర‌గా అభివ‌ర్ణించిన వాళ్లే ఇప్పుడు రైతుల‌తో క‌లిసి న‌డ‌వ‌డానికి సిద్ధం అయ్యారు.అమరావతి రాష్ట్ర రాజధాని గా ఉండాలని న్యాయస్థానం to దేవస్థానం పేరుతో అమరావతి రాజధాని ప్రాంత రైతులు నిర్వహిస్తున్న “మహా పాదయాత్ర కొన‌సాగుతోంది. వ‌ర్షంలోనూ మ‌హిళా రైతులు యాత్ర చేస్తున్నారు. దారిపొడ‌వునా వాళ్ల‌కు మ‌ద్ధ‌తు ల‌భిస్తోంది. ఆ విష‌యాన్ని తెలుసుకున్న అమిత్ షా బీజేపీ ఏపీ శాఖ‌ను మంద‌లించాడు. రైతుల కోసం పోరాటాలు చేయాల‌ని ఆదేశించాడు.
ఈనెల 21వ తేదీన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎంపీలు సుజ‌నా చౌదరి, సీఎం రమేష్, జాతీయ కార్యదర్శి సత్య కుమార్,జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, తదితర పార్టీ ముఖ్య నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ యాత్ర‌లో పాల్గొనబోతున్నారు.

Also Read : కుప్పంగిప్పం జాన్తానై.! షా ఆప‌రేష‌న్ షురూ!!

అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర మీద అమిత్ షా స్పందించే వ‌ర‌కు ఆ యాత్ర‌పై అనుమానాలు ఉండేవి. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య‌లోనే మ‌హాపాద‌యాత్ర‌ను ఆపేస్తుంద‌ని చాలా మంది భావించారు. కేంద్ర హోంశాఖ మంత్రి షా ఇచ్చిన మ‌ద్ధ‌తుతో ఇక దేవ‌స్థానం వ‌ర‌కు యాత్ర కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. పైగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా భ‌ద్ర‌త క‌ల్పించ‌డం మిన‌హా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితికి వ‌చ్చింది.
తొలి నుంచి ఏపీ బీజేపీ అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చెబుతున్న‌ప్ప‌టికీ అందుకు సంబంధించిన రాజ‌కీయ అడుగులు వేయలేదు. కేంద్రం జోక్యం చేసుకుంటే, అమరావ‌తి రాజ‌ధానిగా ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని త్రోసిబుచ్చ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ, రాజ‌కీయంగా అమ‌రావ‌తి అంశాన్ని వాడుకోవాల‌ని బీజేపీ చూస్తోంది. అందుకే, అమిత్ షా ఏపీబీజేపీకి దిశానిర్దేశం చేశాడు.
తెలుగుదేశం, వైసీపీ మీద ప్ర‌జ‌ల‌కు విర‌క్తి క‌లిగేలా చేయ‌డానికి బీజేపీ ఎత్తుగ‌డ వేస్తోంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు వ్య‌తిరేకంగా వెళితేనే బీజేపీ ఏపీలో బ‌ల‌ప‌డుతుంద‌ని ఆ పార్టీ పెద్ద‌ల భావ‌న‌. తెలంగాణ బీజేపీ బ‌ల‌ప‌డింద‌ని న‌మ్ముతున్న ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు, ఇదే ఈక్వేన్ ను ఏపీలో కూడా ఎంచుకోవాల‌ని సూచిస్తోంది. అంటే, అధికార వైసీపీకి వ్య‌తిరేకంగా పోరాటాలు చేయ‌డానికి నిర్ణ‌యించుకుంది. ఆ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఎవ‌రు ఏది చేసినా బీజేపీ మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి రెడీగా ఉండాల‌నే సంకేతం షా ఇచ్చేశాడన్న‌మాట‌.

Exit mobile version