Atmakur : ఉప ఎన్నిక‌పై బీజేపీ, జ‌న‌సేన చెరోదారేనా?

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు కేంద్రంగా మ‌రోసారి బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య అగాధం ఏర్ప‌డ‌నుంది.

  • Written By:
  • Publish Date - May 26, 2022 / 08:00 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు కేంద్రంగా మ‌రోసారి బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య అగాధం ఏర్ప‌డ‌నుంది. ఉప ఎన్నిక‌ల‌కు క‌లిసి వెళ‌తామ‌ని బీజేపీ లీడ‌ర్ జీవీఎల్ న‌ర‌సింహారావు వెల్లడించారు. గ‌తంలోనూ జ‌న‌సేన‌తో ఏ మాత్రం సంప్ర‌దించకుండా తిరుప‌తి లోక్ స‌భ అభ్య‌ర్థిని బీజేపీ ప్ర‌క‌టించింది. ఆ త‌రువాత బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లోనూ బీజేపీ పోటీ చేసింది. కానీ, జ‌న‌సేన మాత్రం దూరంగా ఉంది. సిట్టింగ్ అభ్య‌ర్థులు అకాల మ‌ర‌ణం పొందితే పోటీ చేయ‌కుండా ఆ కుటుంబానికి ఏక‌గ్రీవంగా ఇచ్చే ఆన‌వాయితీ ఏపీలో ఉంది. దాన్నే బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో జ‌నసేన అనుస‌రించింది. కానీ, బీజేపీ మాత్రం పోటీచేసి డిపాజిట్ల‌ను కోల్పోయింది.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆత్మ‌కూరు ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. వ‌చ్చేనెల 23న ఆ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఫ‌లితాలు 26వ తేదీన ప్ర‌క‌టిస్తారు. ఇటీవ‌ల గుండెపోటుతో ఆత్మ‌కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా ప‌నిచేస్తూ గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణించిన విష‌యం విదిత‌మే. ఆ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వ‌హించ‌బోతున్నారు. బ‌హుశా పూర్వ‌పు సంప్ర‌దాయం ప్ర‌కారం తెలుగుదేశం పార్టీ కూడా అక్క‌డ నుంచి పోటీ చేయ‌డానికి దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. కానీ, బీజేపీ మాత్రం సై అంటోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గ ప్రజలతో మమేకం అయి వున్నారు. ఇదిలా వుంటే, భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని ఆత్మకూరులో నిలబెడతామని చెబుతోంది.

ఏపీలో బీజేపీనే ప్ర‌త్యామ్నాయం అని ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ పోటీ చేస్తుంద‌ని ఆయ‌న‌ ప్ర‌క‌టించారు. బీజేపీతో పొత్తు కోసం ఏపీలోని ప్ర‌ధాన పార్టీలు య‌త్నిస్తున్నాయ‌ని చెప్పారు. అయితే, కుటుంబ పార్టీల‌కు వ్య‌తిరేక‌మ‌న్న జీవీఎల్ ఏపీలో వైసీపీ, టీడీపీల‌తో బీజేపీకి పొత్తు ఉండద‌ని స్పష్టం చేశారు. కానీ, జ‌నసేన‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ‌తామ‌ని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల న‌డుమ వ‌చ్చిన ఆత్మ‌కూరు ఉప ఎన్నిక బీజేపీ, జ‌న‌సేన పొత్తుకు మ‌రోసారి స‌వాల్ కానుంది.