AP Politics: పాల్, ప‌వ‌న్ తో బీజేపీ గేమ్‌

ప్ర‌పంచశాంతి దూత , ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఇప్పుడు కాపు సామాజిక‌వ‌ర్గం కార్డ్ ను బ‌య‌ట‌కు తీస్తున్నారు. రెండోసారి ఢిల్లీ వెళ్లిన త‌రువాత ఒక పాత వీడియోను బ‌య‌ట‌కు తీసి ఆయ‌న వ‌ర్గీయులు వైర‌ల్ చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 17, 2022 / 03:21 PM IST

ప్ర‌పంచశాంతి దూత , ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఇప్పుడు కాపు సామాజిక‌వ‌ర్గం కార్డ్ ను బ‌య‌ట‌కు తీస్తున్నారు. రెండోసారి ఢిల్లీ వెళ్లిన త‌రువాత ఒక పాత వీడియోను బ‌య‌ట‌కు తీసి ఆయ‌న వ‌ర్గీయులు వైర‌ల్ చేస్తున్నారు. ఆయ‌న‌కు ప్ర‌పంచ‌శాంతి దూత‌గా గ‌తంలో గుర్తింపు వ‌చ్చిన సంద‌ర్భంగా కాపు సామాజిక‌వ‌ర్గం అభినంద‌న‌లు తెలిపిన ఆ వీడియోను ఇప్పుడు బ‌య‌ట‌కు తీయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. కొంద‌రు ఆయ‌న్ను కాపు సామాజిక‌వ‌ర్గం ఐకాన్ గా సోష‌ల్ మీడియాలో ప్ర‌శంసించారు. అప్ప‌ట్లో ప్ర‌చారం పొందిన ఆ వీడియో చుట్టూ ఇప్పుడు కేఏ పాల్ రాజ‌కీయాన్ని మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేయ‌డం జ‌న‌సేన వ‌ర్గాల్లో గుబులు రేపుతోంది.

కేఏ పాల్, ప‌వ‌న్ ఇద్ద‌రూ ఇంచుమించు ఒకేలా రాజ‌కీయ పార్టీని నడుపుతూ వ‌స్తున్నార‌ని పోల్చే వాళ్లు లేక‌పోలేదు. సినిమా షెడ్యూల్ ను అనుస‌రించి ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీని న‌డుపుతున్నారు. ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాలు ప్ర‌తిరోజూ ఉండ‌వు. నెల‌కో, రెండు నెల‌ల‌కో ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా జ‌న‌సేన పార్టీని ప్ర‌క‌టించారు. ఆనాడు ప‌వ‌న్ మిన‌హా ఆ పార్టీకి ఎవ‌రూ లేరు. అయిన‌ప్ప‌టికీ వ్యూహాత్మ‌కంగా 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ ప్ర‌చార వేదిక‌ల‌పై క‌నిపించారు. ఆయ‌న మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం కార‌ణంగా ప్ర‌ధానిగా మోడీ, ఏపీ సీఎంగా చంద్ర‌బాబు అయ్యార‌ని జ‌న‌సేన ప్ర‌చారం చేసింది. అందుకు త‌గిన విధంగా చంద్ర‌బాబు కూడా అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌వ‌న్ అడుగుల‌కు మ‌డుగులొత్తారు. ఫ‌లితంగా జ‌న‌సేన ఉనికిని చాక‌చ‌క్యంగా కాపాడుకున్నారు. తొలిసారి 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం ఏపీలో కొన్ని చోట్ల మాత్ర‌మే క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీతో క‌లిసి జ‌న‌సేన పోటీ చేసింది. సుమారు 120 చోట్ల డిపాజిట్లు గ‌ల్లంతు కావ‌డంతో పాటు ప‌వ‌న్ రెండుచోట్లా ఓడిపోయారు. ఆ పార్టీకి ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తింపు లేదు. ప్ర‌జాశాంతి పార్టీ త‌ర‌హాలో రిజిస్ట్ర‌ర్ పార్టీగా మాత్ర‌మే జ‌న‌సేన ఉంది.

సేమ్ టూ సేమ్ 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జాశాంతి పార్టీ తొలిసారి బ‌రిలోకి దిగింది. బీ ఫారాల‌ను ఇచ్చే ప్రక్రియ‌లోనే త‌డ‌బ‌డింది. ఆ పార్టీ అధినేత కేఏ పాల్ నామినేష‌న్ వేసిన‌ప్ప‌టికీ బ‌రిలో ఉండ‌డానికి అవ‌కాశం లేకుండా పోయింది. ఆనాడు కాపు ఓట్లకు గాలం వేసే ప్ర‌య‌త్నం పాల్ చేశార‌ని భీమ‌వ‌రం కేంద్రంగా జ‌రిగిన నామినేష‌న్ల ఎపిసోడ్‌ నిద‌ర్శ‌నంగా క‌నిపించింది. తాజాగా ఆయ‌న తెలంగాణ‌, ఏపీల్లో పోటీ చేయ‌డానికి ఈసారి సిద్ధ‌మంటూ దూకుడుగా ముందుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామ‌ని ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ప్ర‌కటించారు. పొత్తుల‌పై మూడు ఆప్ష‌న్ల‌ను ప‌వ‌న్ తీసుకున్నారు. కానీ, పాల్‌ మాత్రం సింగిల్ గా వెళ‌తానంటూ ఇప్ప‌టికే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి దిగారు. ఏపీలో ప‌వ‌న్ కూడా క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం అవుతున్నారు. పాల్ కూడా బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుట్టాల‌ని చూస్తున్నారు. అందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుంటున్న ఆయన తాజాగా కాపు సామాజిక‌వ‌ర్గం మ‌న్న‌న‌ల కోసం వ్యూహాత్మ‌కంగా పాత వీడియోను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

జ‌న‌సేన పార్టీ నిర్మాణం కొంత వ‌ర‌కు ఏపీలో ఉంది. ఈసారి రాజ్యాధికారం దిశ‌గా అడుగులు వేయాల‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ ఉవ్విళ్లూరుతోంది. ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని స్థాపిస్తామంటూ మూడు ఆప్ష‌న్లు తీసుకున్న ప‌వ‌న్ ప్ర‌స్తుతం బీజేపీతో పొత్తు కొన‌సాగిస్తున్నారు. అదే త‌ర‌హాలో ఢిల్లీలోని బీజేపీ నేత‌ల‌తో కేఏ పాల్ స‌యోధ్య‌గా ఉన్నారు. ఇటీవ‌ల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను క‌లిసిన ఆయ‌న రెండు రోజుల క్రితం ప్ర‌ధాని మోడీ, షాను మ‌రోసారి క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు. ఆ విష‌యాన్ని ఢిల్లీ వేదిక‌గా మీడియా స‌మావేశంలోనే పాల్ వెల్ల‌డించారు. ఢిల్లీలోని బీజేపీ అగ్ర‌నేత‌లు బ‌హుశా పాల్ కు ఇస్తోన్న ప్రాధాన్యం జ‌న‌సేనానికి కూడా ఇవ్వ‌డంలేదు. ఇదంతా చూస్తుంటే, ఆ రెండు పార్టీల‌ను బీజేపీ న‌డిపిస్తుందా? అనే అనుమానం క‌ల‌గ‌కుండా ఉండ‌దు. అంతేకాదు, ఏపీలోని ప్ర‌ధాన పార్టీల‌న్నీ బీజేపీతో క‌లిసి ప‌రోక్షంగా ప‌నిచేస్తున్నాయ‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు.

జ‌న‌సేనాని తీసుకున్న మూడు ఆప్ష‌న్ల‌లో టీడీపీ, జ‌న‌సేన కలిసి వెళ్ల‌డం ఒక‌టి. అదే జ‌రిగితే, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన పార్టీతో మెలిగిన విధంగా ప్ర‌జాశాంతి పార్టీతో బీజేపీ జ‌ట్టుక‌ట్టే అవ‌కాశం లేక‌పోలేదు. కాక‌పోతే, ప‌వ‌న్ త‌ర‌హాలో కాకుండా పరోక్షంగా పాల్ ను బీజేపీ రాజ‌కీయంగా వాడుకోవ‌డానికి స్కెచ్ వేస్తుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోకి టాక్‌. అందుకే, కాపు కార్డ్ ను తాజాగా పాల్ బ‌య‌ట‌కు తీశార‌ని చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టికే క్రిస్టియ‌న్ ఓటర్ల‌లో ఎంతో కొంత సానుభూతిని క‌లిగి ఉన్న పాల్ రాబోవు రోజుల్లో కాపు కార్డు ను కూడా ప్లే చేయడానికి సిద్ధం అయ్యార‌ని తాజా వీడియోను చూసిన వాళ్లు అనుమానిస్తున్నారు. ఇదంతా ఏపీ రాజ‌కీయాల్లో బీజేపీ ఆడిస్తోన్న మైండ్ గేమ్ గా పాల్ వాల‌కాన్ని చూసిన వాళ్లు భావించ‌డంలో త‌ప్పులేదేమో!