BJP@AP: ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ వ్యూహం

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి బీజేపీ కొత్త కొత్త వ్యూహాలను అమలుచేయడం ప్రారంభించింది.

  • Written By:
  • Publish Date - October 2, 2022 / 02:15 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి బీజేపీ కొత్త కొత్త వ్యూహాలను అమలుచేయడం ప్రారంభించింది. క్రమంగా వైఎస్ఆర్ సీపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలన్నది ఆ పార్టీ లక్ష్యం. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీ ఎదుగుదలకు ముప్పని కూడా బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా విమర్శలు చేయడంలో బీజేపీ స్థానిక నాయకులు, జాతీయ నాయకులు ఇటీవల కాలంలో మంచి దూకుడు ప్రదర్శిస్తున్నారు.

ప్రజా పోరు యాత్రలో విమర్శల తీరు కూడా వారి వైఖరిని తెలియజేస్తోంది. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఈ యాత్రను 26 జిల్లాల్లో 5వేల చోట్ల నిర్వహిస్తోంది.రాజధాని విషయంలో కూడా బీజేపీ అమరావతికి మద్దతు పలుకుతూ, వైసీపీ ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తువల్ల తమ పార్టీకి ప్రయోజనం ఏమీ ఉండదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కొందరైతే ఆ పార్టీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకే ఎక్కువ ప్రయోజనం అని, ఆ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందన్నది వారి వాదన. మొదట ప్రతిపక్షంగా ఎదిగిన తరువాత బీజేపీ అధికారంలోకి రావడానికి వీలవుతుందన్నది వారి భావన. ఇతర రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి కూడా ఇదే విధానాన్ని అనుసరించినట్లు వారు చెబుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని వారు అనుసరిస్తున్నారు. టీడీపీతో పొత్తు ప్రసక్తిలేదని, జనసేనతో పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు ధృవీకరించాయి. టీడీపీ ఎన్డీఏలో చేరుతుందన్న పుకార్లను కూడా బీజేపీ నేత సునీల్ దేవధర్ కొట్టిపారేశారు. అవి నిరాధారమైనవని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఏపీలోని రెండు పార్టీలు వంశపారంపర్య రాజకీయాలను కొనసాగిస్తున్నాయని, రెండూ అవినీతి పార్టీలేనని విమర్శించారు.

అంతేకాకుండా, అలా ప్రచారం చేయడం ఒక దుర్మార్గపు ఎత్తుగడగా కూడా బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.టీడీపీతో పొత్తు బీజేపీ ఎదుగుదలకు కూడా ఉపయోగపడదన్నది ఆ పార్టీ అధిష్టానం అభిప్రాయం. ఈ నేపథ్యంలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని స్పష్టమవుతోంది

ఇక వైసీపీ విషయానికి వస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవిఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, వై.సత్యకుమార్, కన్నా లక్మీనారాయణ వంటి నేతలు ఇటీవల కాలంలో ఆ పార్టీ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్నారు. వైసీపీ అవినీతి, అక్రమాలను, ఆ ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, నిధులు దారి మళ్లింపు, కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజాపోరులో ఆ పార్టీ,ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
ఇటీవల కాలంలో కేంద్ర మంత్రులు జై.శంకర్, హర్డీప్ సింగ్ పూరి, జి.కిషన్ రెడ్డి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఏపీ పర్యటించి రాష్ట్రానికి కేంద్రం అందించే నిధుల గురించి వివరించారు. రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేయడం భాగంగా ముందు ముందు బీజేపీ అగ్రనేతలు కూడా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది.