BJP Election Plan : కేసీఆర్, జగన్ అప్పులు, బీజేపీ ఎన్నికల అస్త్రం అదే..!

  • Written By:
  • Publish Date - January 21, 2023 / 09:38 AM IST

తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ (PM MOdi) పరోక్ష చురకలు వేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రం అప్పులు ఇవ్వడం లేదని తనను తిడుతోందని గుర్తు చేశారు. అలాగే మరో రాష్ట్రం అప్పుల మీద అప్పులు చేస్తూ ఏమవుతుందో చూస్తున్నామని ఆయా రాష్ట్రాల గురించి మోడీ అనటం జగన్ , కేసీఆర్ లను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది.

ఏ రాష్ట్రం పేరును ఈ సందర్భంగా ఎత్తనప్పటికీ ఆయన వ్యాఖ్యలు ఏపీ తెలంగాణను ( AP, Telangana) ఉద్దేశించే చేశారని అర్థమౌతుంది. తెలంగాణలో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వచ్చే ఏడాది వేసవిలో ఎన్నికలు ఉన్నాయి. అయితే వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఇంకా ముందే జరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ అప్పుల గురించే ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మంత్రులు నిత్యం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు నిధులు కేటాయించడంలో మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీఆర్ఎస్( Bharat Rashtra Samiti) ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ నేతలు ఇప్పటివరకు కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో తెలియజేస్తూ మీడియాకు ఒక పెద్ద జాబితానే సమర్పించారు.

ఏపీలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్థిక నిపుణులు వివిధ వర్గాల నిష్ణాతులు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. శ్రీలంకలా (Srilanka Crisis) ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ అప్పులు 11 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కర్ణాటక పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ తెలంగాణ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకునే విమర్శలు చేశారని అర్థం చేసుకోవచ్చు. అందుకే కేంద్రంలో రాష్ట్రాల్లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలు తీరాయని మోడీ చెబుతున్నారు.

విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. తాము అభివృద్ధితో కూడిన రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు.రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే అభివృద్ది శరవేగంగా సాధించవచ్చని ఆయన చెప్పారు. ఇందుకు కర్ణాటకే నిదర్శనమన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధిని సాధించడం తేలికన్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.