Reservation : చంద్ర‌బాబుపై `కాపు` కాచిన బీజేపీ, వైసీపీ !

ఏపీ రాజ‌కీయాన్ని `కాపు` రిజ‌ర్వేష‌న్ (Reservation) మ‌లుపు తిప్పనుంది.

  • Written By:
  • Updated On - December 22, 2022 / 11:04 AM IST

ఏపీ రాజ‌కీయాన్ని `కాపు` రిజ‌ర్వేష‌న్ (Reservation) మ‌లుపు తిప్పనుంది. అందుకే, వ్యూహాత్మ‌కంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజ్య‌స‌భ‌లో ఏపీలోని `కాపు`(Kapu) రిజ‌ర్వేష‌న్ గురించి ప్ర‌శ్నించార‌ని తెలుస్తోంది. ఆ అంశం రాష్ట్ర ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రం తేల్చేసింది. దీంతో రాజ‌కీయంగా చంద్ర‌బాబును ఇర‌కాటంలో ప‌డేసింది. గ‌త ఎన్నిక‌ల్లో అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు కేంద్రం ప్ర‌క‌టించిన 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌(Reservation)లో 5శాతం కాపు(Kapu)ల‌కు ఇస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీంతో బీసీలు వైసీపీకి సంపూర్ణ మ‌ద్ధ‌తు ఇచ్చారు. ఫ‌లితంగా 151 మంది ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలుచుకోగ‌లిగారు.

గ‌త ఎన్నిక‌ల్లో కాపు రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కేంద్రం కోర్టులోకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా నెట్టేశారు. రాజ్యాంగం ప్ర‌కారం మొత్తం రిజ‌ర్వేష‌న్లు 50శాతానికి మించ‌కూడ‌దు. పైగా రిజ‌ర్వేష‌న్ల‌ను స‌మీక్షించాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంది. రాష్ట్రాల చేతిలో ఏమీ ఉండ‌దని వైసీపీ వాదిస్తూ మ‌ధ్యేమార్గంగా వ్య‌వ‌హ‌రించింది. ఈసారి ఆ అవ‌కాశం లేకుండా బీజేపీ అడ్డుక‌ట్ట వేసింది. ఓబీసీల‌కు రిజ‌ర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్రాల‌కు ఉంద‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా క్లారిటీ ఇవ్వ‌డం సంచ‌న‌లం క‌లిగిస్తోంది. అంతేకాదు ఈ రిజ‌ర్వేష‌న్ల అంశం ప్రాంతీయ రాజ‌కీయాల‌ను ర‌చ్చ‌కీడ్చ‌నుంది. చంద్ర‌బాబు ఇచ్చిన కాపు రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి బీజేపీ స‌ద‌వ‌కాశాన్ని క‌ల్పించింది.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ కోసం(Reservation)

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ కోసం ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. అప్ప‌ట్లో ఆయ‌న ఉద్య‌మం ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్ ను తగుల‌బెట్టే వ‌ర‌కు తీసుకెళ్లింది. ఆ సంద‌ర్భంగా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై మంజునాథ‌న్ కమిటీ వేస్తూ కాపుల‌కు 5శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చేలా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. ఆ రోజు నుంచి కేంద్రం ప‌రిధిలోకి ఆ అంశం వెళ్లింది. ఎలాంటి గెజిట్ రాక‌పోవ‌డంతో రాష్ట్రంలో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల అంశం పెండింగ్ లో ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల‌ను నిర్దేశించిన కాపు రిజ‌ర్వేష‌న్ గురించి మాట్లాడేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ఇప్పుడు ధైర్యం చేయ‌లేక‌పోతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ రిజ‌ర్వేష‌న్ల రాజ‌కీయాస్త్రాన్ని బ‌య‌ట‌కు తీసింది.

గ‌త బీజేపీ, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం కాపులకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ బిల్లు చెల్లుతుంద‌ని కేంద్రం చెప్పింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్ర‌కారం రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీల‌కు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చని సూచించింది. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వ‌ర్గాల‌కు రిజర్వేషన్ల సొంత జాబితాను రాష్ట్ర ప్రభుత్వం త‌యారు చేసుకోవడానికి 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణను కేంద్రం గుర్తు చేసింది. దీంతో ఏపీలో కాపు రిజ‌ర్వేష‌న్ రాజ‌కీయం కాక‌లేప‌నుంది.

అగ్ర‌వ‌ర్ణ పేద‌లు  

విద్య‌, ఉద్యోగాల్లో కాపుల‌కు 5శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డానికి మిగిలిన వ‌ర్గాలు సుముఖంగా లేవ‌ని రాజ‌కీయ పార్టీల భావ‌న‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇస్తే, వెనుక‌బ‌డిన వ‌ర్గాలు దూరం జ‌రిగే ప్ర‌మాదం ఉంది. అంతేకాదు, అగ్ర‌వ‌ర్ణ పేద‌ల్లోని మిగిలిన వ‌ర్గాలు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డాన్ని ఆహ్వానించే ప‌రిస్థితి లేద‌ని రాజ‌కీయ పార్టీల అంచ‌నా. అగ్ర‌వ‌ర్ణ పేద‌లు అనేది పెద్ద విభాగం. ఎస్సీ,ఎస్టీ, బీసీల‌తో పాటు స‌మానంగా అగ్ర‌వ‌ర్ణ పేద‌లు అనే సెక్టార్ ఉంటుంది. దానిలో బ్రాహ్మ‌ణులు, వైశ్యులు, రాజులు,క‌మ్మ‌, రెడ్డి త‌దిత‌ర కులాల‌న్నీ ఉంటాయి. ఆ సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన యూత్ కాపుల‌కు 5శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డాన్ని అంగీక‌రించ‌వు.

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను కేంద్రం 2019 ఎన్నిక‌ల ముందు ప్ర‌క‌టించింది. అయితే, ఆయా రాష్ట్రాల్లో కులాల వారీగా రిజ‌ర్వేష‌న్లు ఇచ్చే వెసుల‌బాటు ఎలా క‌ల్పిస్తుంది? అనేది పెద్ద రాజ‌కీయ ప్ర‌శ్న‌. ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను చూపిస్తూ చంద్ర‌బాబును మ‌రోసారి ఏపీలో ముంచ‌డానికి బీజేపీ ప్లాన్ చేసిందా? అనే సందేహం క‌లుగుతోంది. కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు చంద్ర‌బాబు ఆద్యుడంటూ ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంది. ఆ సామాజిక‌వ‌ర్గం జ‌న‌సేన‌తో మోజార్టీ న‌డుస్తోంది. ఫ‌లితంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన చంద్ర‌బాబును అటు అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇటు కాపుల‌కు కాకుండా పోయేలా బీజేపీ పార్ల‌మెంట్ వేదిక‌గా మాస్ట‌ర్ స్కెచ్ వేసింది.

Also Read :Kapu Reservations: కాపు రిజర్వేషన్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. ఏపీ సర్కార్‌కు తీపి కబురు!