Site icon HashtagU Telugu

Amaravati Capital : అమ‌రావ‌తిపై ‘గ‌వ‌ర్న‌ర్’ ఆట‌

Ap Governor

Ap Governor

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సంబ‌రాలు జ‌రుపుకుంటోన్న అమ‌రావ‌తి రైతుల‌కు బ‌డ్జెట్ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ చేసిన ప్ర‌సంగం చేదును మిగిలించింది. నిర్ణీత గ‌డువును విధిస్తూ రైతుల‌కు న్యాయం చేయాల‌ని హైకోర్టు గ‌త వారం తీర్పు ఇచ్చింది. రాజ‌ధాని మార్పు కుద‌ర‌ద‌ని, ఆ మేర‌కు చ‌ట్టాలు చేసే అధికారం జ‌గ‌న్ స‌ర్కార్ కు లేద‌ని సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన విష‌యం విదిత‌మే. దీంతో అమ‌రావ‌తి ఏపీ ఏకైక రాజ‌ధాని అంటూ రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్ల నుంచి రైతులు, టీడీపీ సానుభూతిప‌రులు స్వీట్లు పంచుకున్నారు. కానీ, రాజ్యాంగ ప‌రిర‌క్ష‌కుడిగా ఉన్న ఏపీ గ‌వ‌ర్న‌ర్ మాత్రం మూడు రాజ‌ధానుల అంశాన్ని సోమ‌వారం బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. పాల‌న వికేంద్ర‌కర‌ణ జ‌ర‌గాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆకాంక్షించాడు. స‌మ‌గ్ర అభివృద్ధి జ‌ర‌గాలంటే, మూడు రాజ‌ధానులు అవ‌స‌ర‌మ‌ని విశ‌దీక‌రించాడు. మూడేళ్లుగా ఆ దిశ‌గా ప్ర‌భుత్వం చేస్తోన్న ప్ర‌య‌త్నాన్ని గుర్తు చేశాడు. ఉగాది నుంచి కొత్త పాల‌న ప్రారంభం అవుతుంద‌ని ప‌రోక్షంగా ఆ రోజు నుంచి మూడు రాజ‌ధానుల పాల‌న ఉంటుంద‌ని సంకేతం ఇవ్వ‌డం వివాద‌స్ప‌దం అయింది.

న్యాయ‌స్థానం, రాజ్ భ‌వ‌న్ మ‌ధ్య ఏపీలో ఇప్పుడు ప‌రోక్ష యుద్ధం ప్రారంభం అయింది. అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధాని అంటూ న్యాయ‌స్థానం చెబుతోంది. పాల‌న వికేంద్ర‌క‌ర‌ణ ఉండాల‌ని రాజ్ భ‌వ‌న్ స్ప‌ష్టం చేస్తోంది. గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ ప్ర‌సంగాన్ని టీడీపీ స‌భ్యులు అడ్డుకున్నారు. మూడు రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌సంగంలో పెట్ట‌డంతో బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను చింపేసి నిర‌స‌న వ్య‌క్త పరిచారు. ప్ర‌సంగం పూర్తయిన త‌రువాత అసెంబ్లీ నుంచి వెళుతోన్న గ‌వ‌ర్న‌ర్ ను అడ్డుకున్నారు. దీంతో మార్ష‌ల్స్ టీడీపీ స‌భ్యుల‌ను త్రోసేశారు. ఆ క్ర‌మంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మార్ష‌ల్స్ మ‌ధ్య కొద్దిసేపు వాగ్వాదం జ‌రిగింది.ఈ ఉగాది నుంచి కొత్త పాల‌న ఉంటుంద‌ని బ‌డ్జెట్ ప్ర‌సంగంలో గ‌వ‌ర్న‌ర్ వినిపించాడు. ఇప్ప‌టికే ఆ ప్ర‌క్రియ జిల్లాల సంఖ్య పెంపు ద్వారా ప్రారంభం అయింది. ఈనెల 26వ తేదీనాటికి జిల్లాల హెడ్ క్వార్ట‌ర్స్ లో ఆఫీస్ లు ప్రారంభం కానున్నాయి. వాటిని విశాఖ రాజ‌ధాని ఆఫీస్ అనుసంధానం చేయ‌నున్నారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం విశాఖ‌కు త‌ర‌లివెళ్ల‌నుంది. అక్క‌డి నుంచే ప‌రిపాల‌న అంతా సాగ‌నుంది. ఆ మేర‌కు కొత్త జిల్లాల ఆఫీస్ ల‌తో సీఎంవో కార్యాల‌యాన్ని అనుసంధానించే ప‌నిలో అధికారులు నిమ‌గ్నం అయ్యారు. న్యాయ‌స్థానాల‌కు అనుబంధంగా ఉండే కొన్ని ఆఫీస్ లు ఇప్ప‌టికే క‌ర్నూలు త‌ర‌లించారు. స‌చివాల‌యం విభాగాధిప‌తుల‌కు విశాఖ‌లో భ‌వ‌నాల‌ను నిర్మించారు. మౌలిక వ‌సతుల‌ను చ‌క‌చ‌కా ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ పీఠాధిపతి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి పెట్టిన ముహూర్తం నుంచి కొత్త పాల‌న విశాఖ నుంచి సాగ‌బోతుంది. అందుకు రాజ్యాంగ బ‌ద్ధ ప్ర‌క్రియ గ‌వ‌ర్న‌ర్ బ‌డ్జెట్ ప్ర‌సంగం నుంచి మ‌రోసారి ప్రారంభం అయింది.ఈ స‌మావేశాల్లోనే స‌మ‌గ్ర మూడు రాజ‌ధానుల బిల్లు పెట్ట‌బోతున్నార‌ని సంకేతాలు ఇచ్చేశాడు. ప్ర‌త్యేక స‌మావేశాల ద్వారా కాకుండా ఇప్పుడే పాల‌న వికేంద్ర‌క‌ర‌ణ బిల్లు పెట్ట‌నున్నార‌ని అర్థం వ‌చ్చేలా సోమ‌వారం గ‌వర్న‌ర్ ఇచ్చిన ప్ర‌సంగం ఉంది. దీంతో అమ‌రావ‌తి రాజ‌ధాని క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింద‌న్న‌మాట‌.