Bird flu: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం..చికెన్ అమ్మకాలు, ఎగుమతులపై ఆంక్షలు

  • Written By:
  • Publish Date - February 23, 2024 / 07:03 PM IST

ఏపీలో బర్డ్ ఫ్లూ అలజడి రేపుతోంది. వారం క్రితం నెల్లూరు జిల్లాలో బయటపడిన ఈ ఫ్లూ ఇప్పుడు చిత్తూరుకు పాకింది. రోజూ వందలకొద్దీ కోళ్లు చనిపోతుండటంతో.. చికెన్ అమ్మకాలు, ఎగుమతులపై ఆంక్షలు విధించారు అధికారులు. దీంతో పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డ రైతాంగం లబోదిబోమంటోంది. అటు వ్యాపారులు సైతం నష్టపోయే పరిస్థితులు వచ్చాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు, 7 లక్షల పెరటి కోళ్లు పెంపకం జరుగుతుండగా.. ఏటా రూ. 800 కోట్ల మేర పౌల్ట్రీ బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి 37,089 మెట్రిక్ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హేచరీస్ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజువారీగా రూ. 5 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. లేటెస్ట్‌గా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఫౌల్ట్రీ వాహనాలను చెక్‌పోస్టుల దగ్గర అధికారులు నిలిపివేస్తుండటంతో.. రోజుకి 5కోట్ల వ్యాపారం ఆగిపోతోందంటూ పౌల్ట్రీ రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రోజువారీగా బెంగళూరు పాండిచ్చేరి, చెన్నైలకు కోళ్లు, కోడిగుడ్లు ఎగుమతులు చేస్తున్న చిత్తూరు జిల్లాలోని హెచరీస్ సంస్థలు ఎగుమతులు లేక తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లాలోని పౌల్ట్రీ ఉత్పత్తులను అనుమతించని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తీరు ఇబ్బందిగా మారింది. దీంతో బార్డర్ చెక్ పోస్టుల దగ్గరే పౌల్ట్రీ రంగం ఉత్పత్తులను రవాణా చేస్తున్న వాహనాలు నిలిచిపోతున్నాయి.