Site icon HashtagU Telugu

Singapore Tour : గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ అడుగులు.. సింగపూర్‌తో భాగస్వామ్యం కోరుతున్న సీఎం చంద్రబాబు

Big steps in the green energy sector.. CM Chandrababu seeks partnership with Singapore

Big steps in the green energy sector.. CM Chandrababu seeks partnership with Singapore

Singapore Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో రెండో రోజు కీలక సమావేశాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్‌ను కలుసుకుని, ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై మంత్రి టాన్‌కు వివరంగా నివేదించిన చంద్రబాబు, అవన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..సింగపూర్‌కు రికార్డులు సరిచేయడమే నా ప్రథమ ఉద్దేశం. గతంలో జరిగిన పరిణామాలు సరిచేసేందుకు, పెట్టుబడిదారుల నమ్మకం తిరిగి సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాం అని స్పష్టం చేశారు. తనకు సింగపూర్‌పై ఉన్న ప్రత్యేక అభిమానం కారణంగానే గతంలో హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్‌షిప్‌ నిర్మించామని గుర్తుచేశారు.

Read Also: Annadatha Sukhibhava : ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ జమ

నవంబర్ నెలలో విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని మంత్రి టాన్‌ సీ లెంగ్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అప్పటి వరకు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో సింగపూర్ మోడల్‌ను అనుసరిస్తున్నామని, అక్కడి లాంటి విధంగా రాత్రి వేళల్లో రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఇది సింగపూర్ నగర నిర్వహణపై మనకు ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. చిరునవ్వుతో స్పందించిన డాక్టర్ టాన్ సీ లెంగ్, ఏపీతో పలు రంగాల్లో కలిసి పనిచేయాలని సింగపూర్ ఉత్సాహంగా ఉంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌, సబ్‌సీ కేబుల్స్ వంటి ఆధునిక రంగాల్లో భాగస్వామ్యం అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, అంతర్జాతీయ వాణిజ్యంలో సింగపూర్ అనుభవాన్ని ఏపీకి ఉపయోగించుకోవాలన్నారు. ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్‌ ఎకానమీకి సేవలందిస్తున్నారు. అదే తరహాలో మా రాష్ట్ర అభివృద్ధికి మీరు మద్దతివ్వాలి అని విజ్ఞప్తి చేశారు.

అలాగే, పోర్టులు, ట్రాన్స్‌మిషన్ కారిడార్లు, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ రంగాల్లో సింగపూర్ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. పోర్ట్ అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల అమలు విషయంలో సింగపూర్ భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఇక, గృహ నిర్మాణ రంగంలో కూడా సింగపూర్ సంస్థలు ఏపీలో చురుకుగా పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనికి మంత్రి టాన్ సీ లెంగ్ సానుకూలంగా స్పందించారు. అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కలిసి పని చేద్దాం అని మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పి. నారాయణ, రాష్ట్ర పారిశ్రామిక మంత్రివర్గ సభ్యుడు టీజీ భరత్‌, ముఖ్య అధికారులు హాజరయ్యారు. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, సమావేశాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సింగపూర్‌తో పునః స్థాపిస్తున్న సంబంధాలు ఏపీకి భవిష్యత్తులో విదేశీ పెట్టుబడుల జలధారను తెచ్చిపెట్టే అవకాశం ఉన్నదని అంచనాలు.

Read Also: Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. నేడు తులం రేటు ఎంతుందంటే?